పత్తి కుంభకోణంలో సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
♦ పత్తి కొనుగోలు కుంభకోణం కేసు పక్కదారి
♦ విచారణ జరగలేదు.. చార్జిషీట్ పెట్టలేదు
♦ తెరవెనుక టీడీపీ పెద్దల మంత్రాంగం
♦ వివాదాస్పద ఫైలుపై మంత్రి ‘ఆది’ సంతకం
♦ నిందితులైన 26 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేత
♦ కాసుల బేరంలో భాగమేనంటున్న ఉద్యోగ వర్గాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వందలాది కోట్ల రూపాయల పత్తి కొనుగోలు కుంభకోణంలో ఎలాంటి విచారణ జరపకుండానే టీడీపీ సర్కారు కేసును పక్కదారి పట్టించింది. సమయం చూసుకుని సర్కారు పెద్దలు పావులు కదిపారు. తెరవెనుక మంత్రాంగంతో చకచకా ఫైలు కొత్త మంత్రి టేబుల్ మీదకు వచ్చింది. సుమారు రూ.650 కోట్ల సీసీఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉన్నతాధికారులు సహా 26 మందిపై విధించిన సస్సెన్షన్ ఎత్తివేశారు. ఈ వివాదాస్పద ఫైలుపై వ్యవసాయ మార్కెటింగ్, పశు సంవర్థక శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈనెల 12న తొలి సంతకం చేయడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఇదివరకటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరెందరో ఉన్నతాధికారులపై ఆరోపణలు, సీబీఐ విచారణ, విజిలెన్స్ విభాగం పరిశీలన వంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్న ఈ ఫైలుపై కొత్త మంత్రి వచ్చీ రాగానే ఆగమేఘాలపై సంతకం చేయడం వెనుక పెద్ద కసరత్తే జరిగిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఫైలుపై మంత్రితో సంతకం చేయించారు. మంత్రి ప్రత్తిపాటిని వివాదం నుంచి బయట పడేసేందుకే ముఖ్యమంత్రి ఇలా చేశారని కొందరంటుండగా, ఇదంతా కాసుల బేరంలో భాగమేనని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇదీ కుంభకోణం..
పత్తి కొనుగోళ్లకు సంబంధించి 2014 – 15లో పెద్ద ఎత్తున అవకవతకలు జరిగాయి. కేంద్రం ఆధీనంలోని సీసీఐ నోడల్ ఏజెన్సీగా రాష్ట్రంలోని మార్కెటింగ్ కమిటీలతో కలిసి కొనుగోళ్లను కొనసాగించింది. 2014 నవంబర్ 7న మార్కెటింగ్ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇది జరిగింది. నాసిరకం పత్తిని మంచి పత్తితో కలిపి సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.4050తో కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ.650 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో తొలుత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ స్థాయిలో, తర్వాత రాష్ట్ర విజిలెన్స్ విభాగం ప్రాథమిక దర్యాప్తు చేశాయి. ఈలోగా సీబీఐ (సీసీఐ కేంద్ర సంస్థ కావడంతో) కూడా రంగంలోకి దిగి రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొనుగోళ్లు జరిగాయో అక్కడ విచారణ చేసింది. సీసీఐ బయ్యర్లు, రాష్ట్ర మార్కెటింగ్ కమిటీల్లోని అధికారులు, కింది స్థాయి సిబ్బంది కలిసి రైతులకు దక్కాల్సిన సొమ్మును మింగేసినట్టు ఈ మూడు దర్యాప్తుల్లోనూ తేలింది. స్వతహాగా పత్తి వ్యాపారి అయిన ఆనాటి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు కూడా ఈ పాపంలో సింహభాగం ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వాధిపతికి రహస్య నివేదికలను అందించాయి. ఇందువల్లే ప్రత్తిపాటిని మరో శాఖకు మార్చారని సమాచారం.
96 మందికి చార్జి మోమోలు, 26 మందిపై సస్పెన్షన్
ఈ కుంభకోణంపై డిపార్ట్మెంట్, విజిలెన్స్ నివేదికల ఆధారంగా మార్కెటింగ్ శాఖ గత ఏడాది 96 మందికి చార్జి మెమోలు జారీ చేసింది. వీరిలో నలుగురు డిప్యూటీ డైరెక్టర్లు వై.రామమోహన్‌రెడ్డి, ఎస్.వెంకట సుబ్బన్న, కె.నాగవేణి, ఎ.రహమాన్ సహా 26 మందిని గత నవంబర్ 20, 21 తేదీలలో సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో విశాఖలోని సీబీఐ అధికారులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిందితులుగా పేర్కొన్న వారిలో సీసీఐ బయ్యర్లు ముగ్గురు, సీసీఐ బ్రాంచ్ మేనేజర్ ఒకరు, పది మంది మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఉన్నారు. చిత్రమేమిటంటే ఈ పది మందిలో ఇద్దర్ని మాత్రమే మార్కెటింగ్ శాఖ సస్పెండ్ చేసింది. మిగిలిన వారిని పట్టించుకోలేదు. సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన తర్వాత చార్జిషీట్లు వేయాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతి లేదు.
పక్కా ప్లాన్‌తో విచారణలో జాప్యం
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి చార్జ్‌మెమో ఇచ్చిన తర్వాత 3 నెలలలోపు ఆ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలి. ఈ కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు తమ వివరణైతే ఇచ్చారు గాని దానిపై తదుపరి చర్య ఏమిటో ఇంతవరకు తేలలేదు. సస్సెండ్ చేసిన తర్వాత ఉద్యోగి ఇచ్చే సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని విచారణాధికారిని నియమించాలి. అభియోగ పత్రాల్ని మోపిన తర్వాత తీవ్రమైన ఆరోపణలు లేవని తేలితేనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి. విచారణ తర్వాత దోషి అని తేలితే చర్య తీసుకోవాలి.
ఇవేవీ జరక్కపోతే 6 నెలల లోపు సమీక్ష చేయాలి. ఈ కేసులో ఇలాంటివేవీ జరగలేదు. ప్రభుత్వం కావాలనే ఇంతవరకు విచారణ అధికారిని నియమించలేదు. లోతుగా దర్యాప్తు జరిపితే మంత్రి ప్రత్తిపాటి పాత్ర బయటపడుతుందనో లేక తమ వర్గానికి చెందిన పత్తి వ్యాపారులను కాపాడాలనో చంద్రబాబు ప్రభుత్వం విచారణ ముందుకు సాగకుండా జాప్యం చేసింది. దర్యాప్తు ఆలస్యం కావడం వల్ల ప్రత్తిపాటి పాత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా చేసిందన్న విమర్శలూ ఉన్నాయి.
మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
96 మందికి చార్జి మెమోలు ఇస్తే 26 మందినే సస్పెండ్ చేయడం వివక్ష అనేది ఉద్యోగుల వాదన. (ప్రభుత్వ భాషలో సెలక్టివ్ సస్పెన్షన్) వ్యాపారం చేసింది సీసీఐ వాళ్లని, వాళ్లు సంతకాలు చేసినందున రొటీన్‌గా తామూ చేశామని, ఇందులో తమకు దక్కిందేమీ లేదని మార్కెటింగ్ సిబ్బంది విజిలెన్స్ దర్యాప్తు సందర్భంగా రాత పూర్వకంగా చెప్పారు. రెగ్యులర్ విచారణ అధికారిని ఇంతవరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ర్యాండమ్ పద్ధతిన తమను సస్పెండ్ చేసినప్పుడు ఆనాటి మంత్రిపై కూడా చర్యలు తీసుకోవాలి కదా? అని నిలదీస్తున్నారు. విచారణ జరక్కుండా 6 నెలలకు మించి సస్పెన్షన్‌లో ఉంచడానికి వీలు లేదని, అందువల్లే సస్పెన్షన్లు రద్దయ్యాయని చెబుతున్నారు.
సస్పెండ్ అయిన డెప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.వెంకట సుబ్బన్న హైకోర్టు నుంచి తీసుకువచ్చిన ఉత్తర్వులే మిగతా 25 మందిని కాపాడాయని భావిస్తున్నారు. తాను త్వరలో పదవీ విరమణ చేయనున్నందున తనను తిరిగి నియమించాలని కోరుతూ సుబ్బన్న కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులతో పాటు ఆంధ్ర, రాయలసీమ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం ఇచ్చిన వినతులను పరిశీలించిన ప్రభుత్వం 26 మందిపై సస్పెన్షన్ ఉపసంహరించాలని నిర్ణయించిందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వివరించారు. అన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నందున వీరు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉండదని, పని అప్పగించకుండా సస్పెన్షన్‌లో ఉంచి జీతాలు ఇవ్వడం ఖజానాపై భారం అని భావించి సస్పెన్షన్ ఎత్తివేసిందన్నారు.
తప్పు చేసినట్లు తేలితే ఉరితీయండి
కడప కార్పొరేషన్: మార్కెటింగ్ శాఖలో సస్పెండ్ అయిన 26 మందికి తిరిగి పోస్టింగులు ఇచ్చిన వ్యవహారంలో తాను తప్పుచేసినట్లు తేలితే ఉరి తీయాలని మార్కెటింగ్, పశు సంవర్థక శాఖామంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సస్పెండ్ అయి తిరిగి పోస్టింగ్స్ తీసుకున్న ఉద్యోగుల ముఖం కూడా తాను చూడలేదన్నారు. ఈ విషయమై ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తనతో చర్చించారన్నారు. ఊరికే జీతం ఇవ్వడం సరికాదనే ఉద్దేశంతో వారికి పోస్టింగులు ఇచ్చామన్నారు. అవి జనరల్ పోస్టింగ్స్ కాదని లూప్లైన్లో వేశామని చెప్పుకొచ్చారు.