పత్తి కొను‘గోల్మాల్’!
♦ రైతుల పేరుతో బడా వ్యాపారుల దందా
♦ బ్యాంకు అకౌంట్లు.. రూ. కోట్లలో లావాదేవీలు
♦ ఐటీ నోటీసులతో లబోదిబోమంటున్న అన్నదాతలు
తాండూరు: కాల్‌మనీ తరహాలో రంగారెడ్డి జిల్లా తాండూరులో పత్తి స్కాం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైతుల పేరుతో కొందరు బడా వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్థిక లావాదేవీలు సాగించడం కలకలం రేపుతున్నది. ఇందుకు సంబంధించి ఆదాయపన్ను (ఐటీ) శాఖ నుంచి నోటీసులు జారీ అవుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. రైతులను బురిడీ కొట్టించి సుమారు రూ.12 కోట్ల వరకు ‘పత్తి’ స్కాం కు పాల్పడినట్లు అంచనా. ఆదాయపన్ను ఎగవే సేందుకు వ్యాపారులు రైతులపేరుతో ఎవరికీ అనుమానం రాకుండా పత్తి కొనుగోలు చేపట్టారు. మార్కెటింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, రైతుల బలహీనతలు వ్యాపారుల దందాకు వరంగా మారాయి.
2.87 లక్షల పత్తి కొనుగోళ్లు
గతేడాది సుమారు రూ.2.87 లక్షల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. ఇందులో సుమారు రూ.2.9 లక్షల క్వింటాళ్లు సీసీఐ సేకరించింది. మిగతా ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాలు ధర రూ.4,050 ఉంది.
దళారులు ఇలా..
గ్రామాల్లో దళారులు రైతుల నుంచి రూ.3,500-రూ.3,600 ధర చొప్పున పత్తిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి బడా వ్యా పారులకు క్వింటాలుకు సుమారు రూ.100 వరకు గిట్టుబాటు చూసుకొని విక్రయిం చారు. వ్యాపారులుగా కూడా రైతుల నుంచి తక్కువ ధరకు నేరుగా కొనుగోళ్లు చేసి వ్యాపారులు తెలివిగా వ్యవహరించారు.
మద్దతు ధరకు విక్రయం
దళారులతోపాటు తాము నేరుగా కొనుగోలు చేసిన పత్తిని రైతుల పేరుతో మద్దతుధరకు విక్రయించారని సమాచారం. ఇందుకుగాను ఎవరికీ అనుమానం రాకుండా రైతుల పేరు తో తాండూరు, బషీరాబాద్ మండలాల్లో బ్యాంకు ఖాతాలు తెరిచారు. బ్యాంకు ఖాతా, చెక్‌బుక్‌లను వ్యాపారులు తమ వద్దనే పెట్టుకున్నారు. అడిగితే పంట పెట్టుబడులకు అప్పులు ఇవ్వరనే భయంతో రైతులు మిన్నకుండి పోయారని తెలుస్తోంది. దీనిని వ్యాపారలు ఆసరాగా చేసుకున్నారు.
రైతు ఖాతాల నుంచి లావాదేవీలు?
ఒక్కొక్క రైతు బ్యాంకు ఖాతా నుంచి రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు దశలవారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో ఆదాయపన్ను శాఖ తాఖీదులు జారీ చేసింది. దీంతో వ్యాపారుల దందా వెలుగు చూసింది.
ముందుకురాని రైతన్నలు..
వ్యాపారులు పరోక్షంగా రైతులకు హెచ్చరి కలు జారీ చేస్తుండడంతో నోటీసుల విషయాన్ని కూడా చెప్పడానికి రైతులు జంకుతున్నారు. మొదటి నుంచి వ్యాపారితో సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు ఏమైనా చెబితే సమస్య వచ్చినప్పుడు తమ వెంట ఎవరూ రారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బషీరాబాద్ మండలంలోని ఐదు గ్రామాల్లో 40 మందికి పైగా రైతులకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. తీగలాగితే డొంక కదిలి నట్టు ఐటీ నోటీసులతో పత్తి అక్రమ వ్యవహారాలు బయటపడుతున్నాయి. ఉన్నతస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
అక్రమం సాగిందిలా..
ఉదాహరణకు ఒక రైతు నుంచి వ్యాపారి/దళారీ పత్తిని సేకరించాడు. నాణ్యతాప్రమాణాల సాకుతో క్వింటాలుకు సుమారు రూ.3,600 వరకు కొనుగోలు చేశారు. ఈ పత్తినే రూ.4,050 మద్దతు ధరకు వ్యాపారి రైతు పేరుతో విక్రయించాడు. బ్యాంకు ఖాతా, చెక్‌బుక్‌లు తనవద్దే పెట్టుకున్నందున ఆన్‌లైన్‌లో డబ్బు జమ కాగానే వ్యాపారులు డ్రా చేసుకుంటున్నారు. క్వింటాలుకు సుమారు రూ.450 వరకు వ్యాపారి సొమ్ము చేసుకున్నాడు. మిగులు రూ.200 వరకు వెన్నుదన్నుగా నిలిచిన అధికారులకు ముట్టచెప్పాడు. ఇటు రైతులను.. అటు ప్రభుత్వాదాయానికి బడా వ్యాపారులు ‘సక్రమంగా’ గండి పెట్టడం గమనార్హం.