పకడ్బందీగా నిర్వహించాలి.
ఇందూరు,న్యూస్‌లైన్ : జిల్లాలో ఈ నెల 13న నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా, రీకౌంటింగ్‌కు తావు లేకుండా నిర్వహించాలని మండలాల రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జడ్పీ రిటర్నింగ్ అధికారి, డీపీఓ సురేశ్‌బాబు సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్వో,ఏఆర్వోలకు ఓట్ల లెక్కిం పుపై ప్రొజెక్టర్ ద్వారా శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ... మొత్తం 36 జడ్పీటీసీ , 583 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మూడు కేంద్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ డివిజన్లో ధర్మారం(బి) శివారులోని తిరుమల ఇనిస్టిట్యూట్, బోధన్ డివిజన్లో రాకాసిపేట్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, కామారెడ్డి డివిజన్లో సదాశివనగర్ మండలం మర్కల్ విలేజ్‌లోని విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ బాక్సులు భద్ర పరిచిన దగ్గరి ప్రాంతాల్లోనే కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటర్లు వేరు వేరుగా ఏర్పాటు చేసి ప్రతి కౌంటింగ్ రూంలో బల్లలు సమకూర్చుకోవాలని ఆయన సూచించారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఒక అభ్యర్థి ఒకే ఏజెంట్‌ను నియమించుకోవాలని, ఒక టేబుల్‌పై ఒక్క ఏజెంట్‌ను మాత్రమే నియమించాలన్నారు. ఎలాంటి సమస్యలకు తావులేకుండా సమయానికి ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం కావాలన్నారు. అలాగే ప్రతి కౌంటర్‌కు ఒక సూపర్వైజర్, ముగ్గురు అసిస్టెంట్లను నియమిస్తున్నామన్నారు. అధికంగా ఓట్లు ఉంటే అదనంగా మరో ఇద్దరు అసిస్టెంట్లను కూడా ఇస్తామన్నారు. అయితే ప్రతి ఒక్క ఓటును క్షుణ్ణంగా లెక్కించాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా రౌండ్ల వారీగా వివరాలను మీకిచ్చిన షీట్లలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి వరకు కౌంటింగ్ చేయకూడదని, రీ కౌంటింగ్ కాకుండా అన్నీ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సెల్ఫోన్లకు అనుమతిలేదు
ఏజెంట్‌గా వ్యవహరించే వారు ఒక్క సారి కౌటింగ్ కేంద్రంలోకి వస్తే మళ్లీ బయటకు వెళ్లాలంటే ఆర్వో అనుమతి తీసుకోవాలన్నారు. ఒక్క ఆర్వోకు తప్ప కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, ఎవరిని కూడా సెల్ ఫోన్లతో లోనికి అనుమతిబోమని స్పష్టం చేశారు. నీళ్లు, చాయ్ లాంటివి కూడా లోనికి అనుమ తి ఉండదనే విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. గెలిచిన అభ్యర్థుల వివరాలు, వారు ఎన్ని ఓట్లతో గెలుపొందిన వివరాలు కూడా కచ్చితంగా నోట్ చేసుకొని ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. ఇక్కడి శిక్షణలో విన్న సూచనలు, నిబంధనలను బుధవారం అభ్యర్థులతో మండల కార్యాలయాల్లో సమావేశం ఏర్పాటుచేసి, తెలియజేయాలని ఆర్వో, ఏఆర్వోలకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ రాజారాం, డ్వామా పీడీ శివలింగయ్య పాల్గొన్నారు.