కంట్రీ ఓవెన్ ఫ్రాంచైజీ బాట
♦ దేశవ్యాప్తంగా ఔట్లెట్ల ఏర్పాటు
♦ యూఎస్‌లోనూ మరిన్ని స్టోర్లు
♦ ఏడాదే ప్యాకేజ్డ్ విభాగంలోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బేకరీ ఉత్పత్తుల తయారీ, విక్రయంలో ఉన్న కంట్రీ ఓవెన్ ... ఫ్రాంచైజీ బాట పట్టింది. 1993 నుంచి ఈ రంగంలో ఉన్న కంపెనీ ప్రస్తుతం యూఎస్‌లో 4, భారత్‌లో 26 కేంద్రాలను సొంతంగా నిర్వహిస్తోంది. రెండేళ్లలో ఫ్రాంచైజీ విధానంలో మొత్తం ఔట్లెట్ల సంఖ్యను 100కు చేర్చాలని నిర్ణయించింది. ఫ్రాంచైజీ ఏర్పాటుకు వివిధ నగరాల నుంచి చాలా మంది ఔత్సాహికులు సంసిద్ధత వ్యక్తం చేశారని కంట్రీ ఓవెన్‌ను ప్రమోట్ చేస్తున్న పొల్సాని గ్రూప్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. చాలా కాలం నుంచి వినతులు వచ్చినప్పటికీ బ్రాండ్‌ను స్థిరపరిచిన తర్వాతే ఈ విధానాన్ని అమలు చేయాలని భావించామన్నారు. కంట్రీ ఓవెన్‌కు 8 లక్షలకుపైగా రెగ్యులర్ కస్టమర్లున్నారని చెప్పారు. ఒక్కో స్టోర్‌కు రూ.15-20 లక్షల పెట్టుబడి అవసరం అవుతుందన్నారు.
చిన్న నగరాల కు విస్తరణ..
కేక్స్, కన్ఫెక్షనరీ, ఫాస్ట్ ఫుడ్ స్నాక్స్ వంటి 500లకుపైగా రకాలు కంట్రీ ఓవెన్ ఔట్లెట్లలో లభిస్తాయి. భారతీయ ఫాస్ట్ ఫుడ్, కేక్స్‌కు యూఎస్‌లో మంచి ఆదరణ ఉందని కంపెనీ తెలిపింది. కస్టమర్లలో 70 శాతం ఎన్నారైలు, 30% స్థానికులని సుధాకర్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ మరో 10 స్టోర్లను తెరుస్తామని చెప్పారు. భారత్‌లో ఔట్లెట్ల ఏర్పాటుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కొద్ది రోజుల్లో ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలోకి ప్రవేశిస్తామని వెల్లడించారు. కంట్రీ ఓవెన్‌తోపాటు ఫుడ్ రిటైల్ షాపుల ద్వారా వీటిని విక్రయిస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీలో 500 మంది ఉద్యోగులు ఉన్నారు. విస్తరణ పూర్తి అయితే మరో 1,500 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. భారత్‌లో తొలి ఈ-కామర్స్ సైట్ కంట్రీ ఓవెన్దేనని గుర్తు చేశారు.