కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి