బాబూ.. డాబు!
- శ్రీసిటీలో రూ.1,500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు గతేడాది భూమి పూజ చేసిన ఇసుజు
- ఏడాదికి 1.20 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమ నిర్మాణానికి శ్రీకారం
- జపాన్ పర్యటనలో శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు ఇసుజు సంస్థ తనకు హామీ ఇచ్చిందన్న చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిమ్మిని బమ్మిని చేయడం అంటే ఇదే..! ఎప్పుడో కుదిరిన ఒప్పందం.. ఇప్పుడే తన సమక్షంలో కుదిరిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. జిల్లాలో సత్యవేడు సమీపంలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.1,500 కోట్ల వ్యయంతో వాహనాల త యారీ సంస్థ ఏర్పాటుకు జనవరి 28, 2013న ఇసుజు సంస్థ ప్రతినిధి బృందం భూమిపూజ చేసింది.
ఆ సంస్థ ప్రతినిధి బృందంతో జపాన్‌లో ఈ నెల 27న సమావేశమైన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఇసుజు సంస్థ శ్రీసిటీలో వాహనాల తయారీ పరిశ్రమకు అంగీకరించిందని.. ఇది పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు సంస్థ పరిశ్రమ నిర్మాణ పనులను సైతం ప్రారంభించిందని.. ఇప్పుడే ఆ పరిశ్రమ మం జూరైనట్లు చంద్రబాబు ప్రకటించడంపై మేధావులు, పరిశీలకులు, పారిశ్రామికవేత్తలు నివ్వెరపోతున్నారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం విదేశీ పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
మొన్న మలేషియాలో పర్యటించిన చంద్రబాబు.. నేడు ఆరో రోజు జపాన్ పర్యటన పూర్తిచేసుకుని మన రాష్ట్రానికిచేరుకోనున్నారు. తన జపాన్ పర్యటన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహ దం చేస్తుందని శనివారం తెలుగు సమాజం అక్కడ నిర్వహించిన సత్కారసభలో చంద్రబాబు పేర్కొన్నారు. జపాన్ పర్యటన సఫలమైందని. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి సంస్థలు ముందుకొచ్చాయని ప్రకటించారు. ఈ క్రమంలోనే శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ అంగీకరించిందన్నారు.
ఇదంతా తన జపాన్ పర్యటన వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవాలు మాత్రం తద్భిన్నంగా ఉన్నాయి. శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ఇసుజు సంస్థ ప్రతినిధులు జనవరి 28, 2013న భూమి పూజ చేశారు. రూ.1,500 కోట్ల వ్యయంతో ఏడాదికి 1.20 లక్షల వాహనాల(80 వేలు దేశంలో విక్రయించేందుకు.. 40 వేల వాహనాలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు) తయారీ సామర్థ్యంతో పరిశ్రమను ఏర్పాటుచేయడానికి మార్చి 15, 2013న అప్పటి పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర, ఇసుజు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో అప్పుడే ఎంవోయూ కుదుర్చుకుందన్నది రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఆ ఎంవోయూ మేరకు ఇసుజు సంస్థ ఇప్పటికే శ్రీసిటీ సెజ్‌లో వాహనాల తయారీ పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టింది. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం తాను జపాన్‌లో పర్యటించి, ఆ సంస్థ ప్రతినిధులను ఒప్పించడం వల్లే ఇసుజు సంస్థ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి అంగీకరించిందని ప్రకటించడం గమనార్హం.