బ్యాంకు గ్యారంటీకి పట్టు!
కోర్సు ఫీజుకు సర్కారే కౌంటర్
గ్యారంటీ ఇవ్వాలని ప్రైవేట్ వైద్య కళాశాలల డిమాండ్
విద్యార్థులకు నరకం చూపిస్తున్న కాలేజీలు
హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీలు తమ తీరు మార్చుకోవడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాలకు సాధ్యంకాని రీతిలో కోర్సు ఫీజు మొత్తానికి బ్యాంక్గ్యారంటీ కావాల్సిందేనని పట్టుపడుతున్నాయి. కోరుకున్న వారికి సీట్లు అమ్మేసుకొని ఇలా బ్యాంకు గ్యారంటీ పెట్టారనే ఆరోపణలున్నాయి. యాజమాన్యాల తీరుపై విద్యార్థులతోపాటు ప్రభుత్వం కూడా గుర్రుగా ఉంది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో బీ కేటగిరీలోని 35 శాతం యాజమాన్య కోటాలో 505 ఎంబీబీఎస్ సీట్లు, 350 డెంటల్ సీట్లున్నాయి. వాటికి తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించిన సంగతి తె లిసిందే. ఈ నెల 21, 22 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రం లో కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్ సీటు పొందే విద్యార్థులు మొదటి ఏడాదికి సంబంధించి రూ. 9 లక్షలు చెల్లించడంతోపాటు మిగిలిన నాలుగేళ్లకు సంబంధించి 36 లక్షల బ్యాంకు గ్యారంటీ చూపాలని స్పష్టం చేశారు.
అలాగే నాలుగేళ్ల బీడీఎస్ కోర్సుకు మొదటి ఏడాది రూ. 4 లక్షలు ఫీజు చెల్లించడంతోపాటు... మిగిలిన మూడేళ్ల ఫీజు రూ. 12 లక్షలకు బ్యాంకు గ్యారంటీ కోరారు. దీన్ని పేద, మధ్య తరగతి వర్గాల తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎంసెట్ అడ్మిషన్ కమిటీ సోమవారం సమావేశమైంది. విద్యార్థులు చదువు మానేసి మధ్యలో వెళ్లిపోతే తమకు నష్టం వస్తుందని, అందుకే నాలుగేళ్ల కోర్సు ఫీజుకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలు పట్టుబట్టాయి. సమావేశం వివరాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి పాపిరెడ్డి ఒక లేఖలో వివరించారు. ప్రైవేటు యాజమాన్యాల ఒంటెత్తు పోకడతో విద్యార్థుల తల్లిదండ్రులు బ్యాంక్ గ్యారంటీ కోసం అధిక వ డ్డీలకు అప్పులు చేస్తున్నారు. కొందరైతే తమ పిల్లల పెళ్లిళ్లకు సంపాదించుకున్న కొద్దిపాటి ఆస్తులను తాకట్టు పెడుతున్నారు.