బుద్ధి మాంద్యం వాటి వల్లే!
వాషింగ్టన్: మెదడు వ్యాధులు, బుద్ధి మాంద్యం వంటి ప్రక్రియల్లో కీలక పాత్ర పోషించే 30 వారసత్వ జన్యువులను తొలిసారిగా పరిశోధకులు గుర్తించారు. నాడీ కణాల అభివృద్ధి లోపాలు ప్రపంచవ్యాప్తంగా 2.13 కోట్ల ప్రజలను ప్రభావితం చేస్తున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) చెబుతోంది. మానసిక వైకల్యం లేదా బుద్ధి మాంద్యం 18 ఏళ్ల పిల్లల్లోనూ కనిపిస్తోందని మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1 నుంచి 3 శాతం జనాభా ఎంతో కొంత దీని బారిన పడ్డారని తెలిపారు. అందులో సగం కేసులకు పోషకాహార లోపం వంటి కారకాలే కారణమని, మిగిలిన 50 శాతం కేసులకు జన్యు లోపాలు, జన్యు మార్పిడులే కారణమని వివరించారు. నెదర్లాండ్‌లోని రాడ్బౌడ్ వర్సిటీ మెడికల్ సెంటర్, పాకిస్తాన్‌లోని వర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఈ అధ్యయనం చేపట్టాయి.