ఆదాయ పంట.. అలసంద
పంట సాగుకు ఇదే అదును
రబీలో ఈ పంట వేసుకోవడానికి నవంబర్ నెల నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. తేలికపాటి నేలలు, ఇసుకతో కూడిన బరువైన నేలలు, ఎర్రనేలలు, మురుగు నిల్వ ఉండని ఒండ్రు మట్టి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి.
ఒక ఎకరాలో అలసంద సాగు చేయాలంటే 8 నుంచి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. అదే అంతర పంటగా సాగు చేయాలంటే 3 నుంచి 4 కిలోల వరకు సరిపోతాయి. సాళ్ల మధ్య 45 సెంటి మీటర్లు మొక్కల మద్యల 20 సెంటిమీటర్లు ఉందేలా విత్తుకొవాలి. నాగలితో గాని గొర్రుతో వేసుకోవాలి.
సేంద్రియ ఎరువుతో అధిక దిగుబడి
రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడితే విత్తన నాణ్యత పెరుగుతుంది. దిగుబడి అధికంగా వస్తుంది. రసాయనిక ఎరువులైతే.. ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాష్ ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. అంతర పంటగా సాగు చేసినట్లయితే ఈ ఎరువులు ఏవీ వాడాల్సిన అవసరం లేదు. ప్రధాన పంటకు వేసిన ఎరువులే సరిపోతాయి.
చీడపీడల నుంచి రక్షణ ఇలా :
చిత్త పురుగులు : పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆకులపై రంగులు చేసి నష్టపరుస్తాయి. వీటి వల్ల మొక్క బలహీనపడి పెరుగుదల ఆగిపోతుంది. చిత్త పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్ మిల్లీలీటర్ మందుతో కిలో విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్ గానీ ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును గానీ లీటరు నీటికి కలిపి పంటకు పిచికారీ చేయాలి.
పేనుబంక : పేనుబంకతో అలసందకు ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ పురుగులు మొక్కల అన్ని భాగాలనూ ఆశించి రసం పీల్చి, ఎదుగుదలను తగ్గిస్తాయి. నివారణకు ఇమిడాక్లో ప్రిడ్ గానీ కార్డ్బోసల్ఫాన్ మందుతో విత్తనశుద్ధి చేయాలి. పైరులో పేనుబంకను గమనిస్తే డైమిథోయేట్ 2.0 మి.లీ. గానీ, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వేరుకుళ్లు తెగులు
ఈ తెగులు సోకిన మొక్కలు, ఆకుల వాడిపోయి ఎండిపోతాయి. విత్తిన 3 వారాల్లో ఎండిపోయిన మొక్కలు పొలంలో పలచగా అక్కడక్కడా కనిపిస్తాయి. ట్రైకోడెర్మావిరిడీ 4 గ్రాములు, థైరామ్ 3 గ్రాములను కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకుంటే వేరుకుళ్లు రాకుండా చేయవచ్చు. వేరుకుళ్లు సోకితే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3.0 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లు తడిసేలా పోయాలి. బొబ్బర్ల సాగులో ఈ యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులకు ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు నికర ఆదాయం లభిస్తుంది.
విత్తనాల రకాలు :
జీసీ-3 : ఈ రకం విత్తనాలు వేస్తే 85-90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3-4క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
వీ-2 : ఈ రకం విత్తనం ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.పంట 90 నుంచి 95 రోజుల్లో దిగుబడి వస్తుంది.
కో-7 : ఈ విత్తనం 70 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుంది. పంట దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వస్తుంది.
సీ 152 : ఈ రకం విత్తనంతో 90 నుంచి 100 రోజులో
పంట చేతికి వస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
టీపీటీసీ-29 : ఈ రకం విత్తనం 85 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల వరక దిగుబడి వస్తుంది.