ఇంకా పత్తా లేని 130 మంది
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జమ్ము, కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసుల్లో ఇంకా 130 మంది జాడ తెలియడం లేదు. మొత్తం 789 మంది వరదల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వీరిలో ఇప్పటి వరకు మొత్తం 125 మందిని రక్షించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారని, వరద ప్రవాహం తగ్గగానే వారిని శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ఢిల్లీకి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని రెవెన్యూ శాఖ కార్యదర్శి గౌరవ్ గుప్తా బుధవారం తెలిపారు.
ఆచూకీ తెలియని 130 మంది గురించి వాకబు చేస్తున్నామని చెప్పారు. జమ్ము, కాశ్మీర్లో రక్షించిన వారిలో ఎంపీ. నారాయణ, రమ్యా నారాయణ అనే వారు బుధవారం ఉదయం బెంగళూరు చేరుకున్నారని చెప్పారు. నగరానికి సమీపంలోని సారక్కికి చెందిన 27 మంది శ్రీనగర్ రాజ్ భవన్ హెలిపాడ్ వద్ద చిక్కుకున్నారని, వారిని చేరుకోవడానికి రక్షణా సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించ లేదని తెలిపారు. అయితే వారు తమ బంధువులతో ఫోనులో మాట్లాడగలుగుతున్నారని చెప్పారు.
బెంగళూరులోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) కార్యాలయానికి వారు ఈ సమాచారాన్ని చేరవేశారు. కేంద్రానికి కూడా సమాచారాన్ని అందించారు. బెంగళూరు నుంచి కాశ్మీర్‌కు వెళ్లిన సీనియర్ అధికారుల బృందానికి కూడా ఈ విషయాన్ని చేరవేశారు. వారికి అత్యవసరమైన సరుకులను చేరవేయడానికి ఏర్పాట్లు చేశామని గుప్తా చెప్పారు.
మరో వైపు బెంగళూరు నుంచి కాశ్మీర్‌కు వెళ్లిన 14 మంది ఆచూకీ తెలియడం లేదని వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల ఆరో తేదీన వారు శ్రీనగర్‌కు వెళ్లారని, అక్కడ గ్రాండ్ మమతా హోటల్లో తాము బస చేసినట్లు ఏడో తేదీన ఫోన్ ద్వారా తెలిపారని బంధువులు చెప్పారు. తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోను రాలేదన్నారు. వారు ఎక్కడున్నారు, ఎలాగున్నారో తెలుసుకోవాలని ఇక్కడి ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయంలో కోరారు.