ప్రత్యేక ముద్రతో ముందుకెళదాం
* సీపీఎం కేంద్ర కమిటీ భేటీలో నిర్ణయం
* బూర్జువా పార్టీలకు మద్దతు వల్లే ప్రజల్లో చులకనయ్యాం
* ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా విధానాలు అవలంబిద్దాం
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు పార్టీగా ప్రత్యేకతను చాటుకునేలా ముద్రవేసే విధానాలను రూపొందించుకుని ప్రజలకు దగ్గర కావాలని సీపీఎం నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం పార్టీ రాజకీయ ఎత్తుగడల వ్యూహం ముసాయిదా తీర్మానాన్ని సీపీఎం కేంద్ర కమిటీ ఆమోదించింది. ఇప్పటివరకు అనుసరించిన రాజకీయ విధానాల వల్ల బూర్జువా పార్టీలకు, వామపక్షాలకు పెద్దగా తేడా లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందనే భావన కేంద్ర కమిటీ భేటీలో వ్యక్తమైనట్లు సమాచారం.
రాజకీయ కారణాలతో బూర్జువా పార్టీలకు మద్దతు తెలిపి, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడటంపట్ల ప్రజల్లో చులకనైనట్లు కొందరు నాయకులు గట్టిగా వాదించినట్లు తెలిసింది. పార్టీపట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిన నేపథ్యంలో మళ్లీ వారి అభిమానాన్ని పొందేందుకు ముందుకు సాగాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. దేశంలోని అట్టడుగు, బలహీనవర్గాలు, మహిళలు, మధ్యతరగతి, యువతను చేరుకునేలా విధానాలను రూపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. పాతికేళ్లలో అనుసరించిన రాజకీయ విధానాల వల్ల పార్టీకి నష్టం జరిగిందని అంగీకరిస్తూనే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది.
ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి అనుగుణంగా ఆయా వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధానాలతో ముందుకెళ్లాలని నిశ్చయించుకుంది. కేవలం ఆర్థికపరమైన అంశాలకే పరిమితం కాకుండా ప్రజాబాహుళ్యంలోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు గత మూడేళ్లలో అనుసరించిన, రాబోయే మూడేళ్లలో అనుసరించాల్సిన రాజకీయ విధానంపై తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో తరఫున పార్టీ నాయకులు మంగళవారం ప్రవేశపెట్టారు. దీనిపై చర్చించి బుధవారం ఆమోదించనున్నారు.
అయితే జాతీయ స్థాయిలో 6, 7 వామపక్షాలు కలిసి నడుస్తాయని భావిస్తున్నా, రాష్ట్ర స్థాయిల్లో ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో తేల్చకపోవడంతో మళ్లీ గందరగోళ పరిస్థితులే ఏర్పడనున్నాయి. జాతీయ స్థాయిలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో కూటమి ఏర్పాటు అని చెబుతున్నా రాష్ర్టస్థాయిల్లోనే సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉండటంతో ఇక్కడ ఎటువంటి విధానాలను అనుసరించాలనే దానిపై స్పష్టత కొరవడింది. కాగా, కమ్యూనిస్టుల ఐక్యత కు సంబంధించి కూడా స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీల ఐక్యత లేదా విలీనమా అనే అంశంలో తేడాలేనప్పుడు కలిసే సాగాలని వామపక్ష ఉద్యమ శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నా ప్రస్తుతానికి అవేవీ కేంద్ర కమిటీ ఎజెండాలోకి రాకపోవడం గమనార్హం. పార్టీ విధానాల వల్ల తప్పులు జరిగాయని అంగీకరించడం, నూతన పంథాను అవలంబించబోతున్నామని చెప్పడం మినహా మొత్తంమీద ఈ కేంద్ర కమిటీ సమావేశాల్లో కొత్తదనమేదీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.