హోండా కార్ల ధరలు పెరిగాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్ల ఇండియా కూడా తన మోడల్స్ ధరలను పెంచేసింది. జీఎస్టీ సెస్‌కు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు ఈ కంపెనీ కూడా ప్రకటించింది. సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ మోడల్స్‌పై రూ.7,003 నుంచి రూ.89,069 మధ్యలో ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సమీక్షించిన ధరలు అమల్లోకి తెస్తున్నామని హోండా కార్ల ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. జీఎస్టీలో 2-7 శాతం అదనపు సెస్ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తన మిడ్‌సైజు సెడాన్ సిటీ ధరలు వేరియంట్లను బట్టి రూ.7,0003 నుంచి రూ.18,791 వరకు పెరిగాయి. ఎస్యూవీ బీర్-వీ ధరలను రూ.12,490 నుంచి రూ. 18,242 మధ్యలో పెంచింది.
అదేవిధంగా ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వీ ధరలను రూ.75,304 నుంచి రూ.89,069 వరకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలను రూ.13వేల నుంచి రూ.1.6 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం సెస్‌ను పెంచడంతో మిడ్‌సైజు కార్ల జీఎస్టీ రేటు 45 శాతం, పెద్ద కార్ల జీఎస్టీ రేటు 48 శాతం, ఎస్యూవీ రేటు 50 శాతం పెరిగిన సంగతి తెలిసిందే.