నగలు చేయించమందని భార్యను చంపేశాడు
అనంతపురం: బంగారు నగలు చేయించమని అడిగినందుకు భార్యను హతమార్చాడో కిరాతక భర్త. అంతేకాకుండా ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... డి.హీరేహాళ్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మల్లెన్నకు ఇద్దరు భార్యలు. మల్లెన్న వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం విడాకులు ఇచ్చింది. ఆ తరువాత మల్లెన్న కర్ణాటకలోని కన్నేకుప్పకు చెందిన నాగవేణిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
మల్లెన్నతనకున్న 30 ఎకరాల పొలంలో ఈ మధ్య పత్తి పంట వేశారు. పంటలో దిగుబడి బాగా రావడంతో నాగవేణి బంగారం చేయించమని భర్తను అడిగింది. అందుకు మల్లెన్న ససేమిరా అన్నాడు. దాంతో ఇద్దరికి మాటామాటా పెరిగడంతో మల్లెన్న కోపోద్రిక్తుడై నెత్తిమీద బలంగా కొట్టడంతో నాగవేణి అక్కడిక్కడే మృతి చెందింది.
అయితే ఏంచేయాలో దిక్కుతోచని మల్లెన్న భార్య మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని తమదైన శైలిలో విచారించడంతో జరిగిన విషయమంతా చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
(డి.హీరేహాళ్)