ఓట్లు.. నోట్లు.. కోట్లు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఖర్చు హద్దు మీరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు రూ.కోట్లలో డబ్బులు వెదజల్లారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన ఎన్నికలు కావడంతో పదవులపై మరింత క్రేజ్ పెరిగింది. ఉన్న పదవులను నిలుపుకోవడానికి సిట్టింగ్‌లు, ఎలాగైనా చట్టసభల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కొత్తవారు పోటాపోటీగా రూ.కోట్లు కుమ్మరించారు. మొత్తంగా లెక్కేస్తే జిల్లావ్యాప్తంగా అభ్యర్థుల ఖర్చు రూ.200 కోట్లు దాటిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో జగిత్యాల కోరుట్ల, నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 168 మంది, పార్లమెంట్ స్థానాలకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు 40 మంది దాకా ఉన్నారు. ఎంపీ స్థానాలకు మరో ఆరుగురు పోటీలో నిలిచారు. మిగిలిన వారిలో రామగుండం, కోరుట్ల నియోజకవర్గాల్లో ఐదుగురు స్వంతంత్ర అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఎనిమిది సెగ్మెంట్లలో ఒక్కో అభ్యర్థి రూ.2కోట్ల నుంచి రూ.10 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మానకొండూర్, చొప్పదండి, ధర్మపురి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ఖర్చు పెట్టారు.
ఎనిమిది నియోజకవర్గాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు అభ్యర్థులు డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చుపెట్టడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఎమ్మెల్యే అభ్యర్థులు రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు రూ.78 లక్షలు ఖర్చు మాత్రమే ఖర్చు చేయాలి. దీంతో దొడ్డిదారిన కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థులు కాగితాల్లో మాత్రం తమ ఖర్చులను రూ.లక్షల్లోనే చూపించడం గమనార్హం. ఎన్నికల బరిలో నిలిచిన బడా వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు నామినేషన్ అఫిడవిట్లో కొండంత ఆస్తులను గోరంత చూపినట్టుగానే ఖర్చుల లెక్కలను తలకిందలు చేసి సమర్పించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
మంథనిదే అగ్రభాగం
నువ్వా.. నేనా.. అన్నట్టు ప్రధాన పార్టీల అభ్యర్థుల ముఖాముఖి పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. ఎలాగైనా సరే ప్రత్యర్థిని చిత్తు చేసి పైచేయి సాధించాలనే కాంక్షతో అభ్యర్థులు రూ.కోట్లు కుమ్మరించేందుకు ఏమ్రాతం వెనుకాడలేదు. ఈ కోవలో మంథని నియోజకవర్గం ఎన్నికల అగ్రభాగాన నిలిచింది. తర్వాత స్థానంలో కరీంనగర్, కోరుట్ల, రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, హుస్నాబాద్, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గాలున్నాయి. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో బడా వ్యాపారవేత్తలే ఆయా పార్టీల తరపున బరిలోకి దిగడం కూడా ధన ప్రవాహానికి కారణమైంది. అసలు డబ్బులు పెట్టే ఒప్పందంపైనే వారికి టికెట్లు ఇచ్చారనే ప్రచారం కూడా ఆయా పార్టీల శ్రేణుల నోళ్లలో నానుతోంది. ఇందుకు తగినట్లే సదరు అభ్యర్థులు పోటీపడి డబ్బులు ఖర్చు చేసినట్టు సమాచారం.
నగదు.. నగలు..
మందు.. చీరెసారెలు..
చాలా చోట్ల అభ్యర్థులు ఓటుకు నోటు విధానాన్నే అనుసరించారు. ఒకరు ఓటుకు రూ.500 ఇస్తే.. మరొకరు రూ.1000 వెయ్యి ఇచ్చి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు. తప్పదనుకున్న చోట ఇంటికి రూ.5వేలు, రూ.10వేలు సైతం ముట్టజెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. మంథని లాంటి ప్రాంతంలో బంగారు ఆభరణాలు కూడా ఓటర్లకు నేరుగా అందాయి. బంగారు రింగులు, చెవిపోగులు ఇచ్చి మహిళా ఓట్లకు గాలం వేశారు. పోలింగ్‌కు వారం రోజుల నుంచే డబ్బులు పంచడం మొదలుపెట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా సంఘాల ఓట్లను అభ్యర్థులు గంపగుత్తగా కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు అందించారు. కుల సంఘాలు, యువజన సంఘాలకు సైతం ప్యాకేజీలు ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వంట సామగ్రి కొనుగోలు చేసి ఇచ్చారు.
దేవాలయాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు విరాళం ప్రకటించి సగం డబ్బులు పోలింగ్‌కు ముందే అందించారు. కొంతమంది అభ్యర్థులు డబ్బులు వెదజల్లి ద్వితీయ శ్రేణి నాయకులను కొనుగోలు చేశారు. ఆయా గ్రామాల్లో పార్టీ ఊపు రావాలంటే అక్కడి సర్పంచ్, వార్డు సభ్యులు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, కులసంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులను ముందుగానే మచ్చిక చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి స్థాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల దాకా సమర్పించుకున్నారు. ఇలా.. అసెంబ్లీ అభ్యర్థులంతా రూ.150 కోట్ల దాకా ఖర్చు చేయగా, పార్లమెంట్ అభ్యర్థుల ఖర్చు రూ.50 కోట్లు మించిపోయింది.
ప్రజాస్వామ్యం పరిహాసం
ప్రలోభాలకు లొంగవద్దు.. ఓటును అమ్ముకోవద్దు.. అంటూ అధికారయంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినా ఉత్తదే అయ్యింది. ఈ ప్రచారం వల్ల పోలింగ్ శాతం పెరిగినా డబ్బు చేతులు మారకుండా ఆగలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నిలువరించేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా, స్పెషల్ స్వ్కాడ్లు తిరిగినా, కెమెరా కన్నేసినా, బ్యాంక్ లావాదేవీలపై నిఘా పెట్టినా ఫలితమివ్వలేదు. హైదరాబాద్ నుంచి జిల్లాకు వస్తున్న టీడీపీ ఫండ్ రూ.కోటి బొల్లారం వద్ద దొరకడం మినహాయించి, జిల్లాలో మాత్రం అలాంటి సంఘటనలు శూన్యం. ఓటరు అడుగుతున్నాడని అభ్యర్థి...అభ్యర్థి ఇస్తున్నాడని ఓటరు... ఎవరికి వారు తమను తాము సమర్థించుకోవడంతో ఎన్నికల్లో డబ్బే ప్రధాన పాత్ర పోషించింది.