మాట వింటే ఉండు.. లేదంటే వెళ్లిపో!
► ఏపీఓ చక్రవర్తిపై టీడీపీ నేతల ఫైర్
► చెప్పిన పనులు చేయాలని హుకుం
► ఈ ఏపీఓ మాకొద్దని పీడీకి ఫిర్యాదు
ఆలూరు రూరల్: ‘మా మాట వింటే ఉండు లేదంటే వెళ్లిపో.... మా పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పింది వినాల్సిందే. వారు అడిగిన పని చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకుండేది లేదు’ అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్ ఆలూరు ఏపీఓ చక్రవర్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏపీఓ ఆలూరు మండలంలో వద్దు బదిలీ చేయాలని జిల్లా డ్వామాపీడీ పుల్లారెడ్డికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. కమ్మరచేడు గ్రామంలో టీడీపీ నేత చెప్పిన వారికి ఏపీఓ గడ్డపారలు పంపిణీ చేయలేదు.
ఈ విషయంపై ఆ గ్రామ టీడీపీ నేత, ఏపీఓ చక్రవర్తి మధ్య గత వారం రోజులుగా వార్ సాగుతుంది. ఎట్టకేలకు ఏపీఓ చక్రవర్తి గ్రామ పంచాయతీ తీర్మానం, వంద రోజులు పనులు పూర్తి చేసిన వారికి ఫీల్డ్ అసిస్టెంటు, సీనియర్ మేటీలు పంపిన కూలీల పేర్లకే గడ్డపారలను పంపిణీ చేస్తామని తెగేసి చెప్పారు. దీనిని జీర్ణియించుకోలేక ఆ నేత బుధవారం ఆలూరుకు వచ్చిన నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే వారు ఏపీఓ కార్యాలయానికే వెళ్లారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పిన పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఏపీఓ సమాధానం చెబుతుండగానే.. డ్వామా పీడీ పుల్లారెడ్డికి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్ ఫోన్ చేశారు. తమ మాట వినని ఏపీఓ ఇక్కడ పని చేయకూడదని ఫిర్యాదు చేశారు.
నిబంధనల ప్రకారమే నడుచుకున్నా..
కమ్మరచేడు గ్రామ టీడీపీ నేత ప్రజాప్రతినిధికి బంధువు అయినంత మాత్రాన ఆయన మాటలు విని, ఓ అధికారి అని కూడా చూడకుండా కించపరిచేలా సిబ్బంది ఎదుట మాట్లాడడం టీడీపీ నేతలకు తగదు. నిబంధనల ప్రకారం నడుచుకునే అధికారులపై ఒత్తిళ్లు తగవు. అవసరమైతే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూడా సిద్ధమే. - చక్రవర్తి, ఏపీఓ