శ్రీవారి దర్శనానికి 23 గంటలు
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. చంటిబిడ్డల తల్లిదండ్రులు, ఆర్జిత సేవలు అనుమతించే సుపథం క్యూలో తోపులాట జరిగింది. సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి ఈ మార్గంలో కల్యాణోత్సవం, ఇతర ఆర్జిత సేవల భక్తులను అనుమతిస్తారు. వీరితోపాటు ఏడాది లోపున్న చంటి బిడ్డలతో వారి తల్లిదండ్రులు కూడా కలసిపోయారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లేందుకు చొరబడ్డారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వారి మధ్య తోపులాట జరిగింది. పెరిగిన రద్దీ వల్ల వృద్ధుల క్యూ భారీగా విస్తరించింది.
సాయంత్రానికి సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండి వెలుపల సుమారు కిలోమీటరు వరకు వేచి ఉన్న భక్తులకు 23 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 12 గంటల తర్వాత దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ. 300 టికెట్ల దర్శన క్యూను ఉదయం 12 గంటలకే నిలిపివేశారు. అప్పటికే క్యూలో ఉన్న భక్తులకు 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించింది. శనివారం భక్తులు హుం డీలో వేసిన కానుకలను ఆదివారం లెక్కిం చగా రూ. 3.20 కోట్లు లభించింది.