పోర్టల్ ద్వారా జనన, మరణ పత్రాల మంజూరు
నెల్లూరు సిటీ: సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జనణ, మరణ ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేయనున్నట్లు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ప్రైవేట్ హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బందికి సీఆర్ఎస్ పోర్టల్ వినియోగంపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, సీఆర్ఎస్ పోర్టల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్ల వారు తనకు పత్రాలను పంపిస్తే పరిశీలించి మంజూరు చేస్తానన్నారు. 21 రోజుల్లో సంబంధిత పత్రాలను తనకు మెయిల్ చేయాలని, లేని పక్షంలో లేట్ ఆర్డర్ అవుతుందని, కార్పొరేషన్‌కు వచ్చి పత్రాలను ఇవ్వాలని సూచించారు. హాస్పిటళ్ల డాక్టర్లు, సిబ్బందికి యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఇచ్చారు. ఐడీలు, పాస్‌వర్డ్‌లను బయట వ్యక్తులకు తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తప్పుడు పత్రాలను నమోదు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.