ఈ నెల 10 తర్వాత కీలక పరిణామాలు: దామోదర
అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చినా చర్చించకపోవడం మూర్ఖత్వం అవుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. కేంద్రంలో రెండు పెద్ద పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ఉన్నాయని తెలిపారు. అలాంటిది సీమాంధ్రుల్లో ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుందో అర్థంకావడం లేదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం కోసం ఫిబ్రవరి మొదటి వారంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు తప్పకుండా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. చివరి రోజు వరకు సీఎం తన పదవిలో కొనసాగేందుకు కిరణ్ ప్రయత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 10వ తేదీ తర్వాత రాష్ట్రంలో పలు కీలక పరిణామాలుంటాయని దామోదర రాజనర్సింహ వెల్లడించారు.