ప్రచురణ కర్తలు.. సాంస్కృతిక రాయబారులు
న్యూఢిల్లీ: ప్రచురణకర్తలు దేశ సాంస్కృతిక రాయబారుల్లాంటి వారని ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత ధూపాటి విజయకుమార్ అన్నారు. రచయితలకూ, ప్రజలకూ మధ్య వారధిలా ఉంటూ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండే విజ్ఞాన వ్యాప్తికి ప్రచురణకర్తలు దోహదం చేస్తారని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడి కేంద్ర సాహిత్య అకాడమీలో ‘భారతీయ సాహిత్యంలో ప్రచురణ కర్తల పాత్ర’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలోని వివిధ భాషల ప్రచురణకర్తలతో కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి వారి మధ్య ఒప్పందాలకు వీలు కల్పించాలని సూచించారు. జ్ఞానపీఠ ఫౌండేషన్ నిర్దేశకుడు లీలాధర్ మాండ్లోయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డి.కె. ఏజెన్సీస్ అధినేత రమేశ్ మిట్టల్, డీసీ పబ్లిషర్స్ అధినేత రవి డీసీ తదితరులు మాట్లాడారు.