రైల్వే స్టేషన్లో హాకర్ ఆర్తనాదం
రైలుకింద పడడంతో తెగిపడిన కుడి కాలు
ఆ కాలితోనే ప్లాట్‌ఫాంపై అరగంట నరకయాతన
కరీమాబాద్ : రైళ్లలో చాయ్, బిస్కట్లు, వాటర్‌బాటిళ్లు అమ్ముకునే హాకర్ అదే రైలు కింద ప్రమాదవశాత్తు పడి కాలు పోగొట్టుకున్న సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ -2లో జరిగింది. స్టేషన్‌లోని ప్రయాణికులు, వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం రావురూపుల గ్రామానికి చెందిన బాగి కనకరాజు(30) రైలులోని మొబైల్ ప్యాంట్రీ కార్లో హాకర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని శివనగర్‌లో కిరాయి ఇంట్లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో అతడు మంగళవారం ఉదయం స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్ఫామ్లో తెల్లవారుజామున 6 గంటలకు విశాఖపట్నం నుంచి సికంద్రాబాద్‌కు వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్‌కు రైలు పట్టాలకు మధ్య పడిపోయాడు. దీంతో అతడి కుడికాలు తెగిపడిపోయింది. గమనించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది వెంటనే కనకరాజును పట్టాల మీది నుంచి తీసుకొచ్చి ప్లాట్‌ఫామ్ మీద గద్దెపై కూర్చోబెట్టారు. అంతేగాక తెగిపడిన కాలిని కూడా అతడి వద్ద ఉంచడంతో ఆ కాలునే అరగంట పాటు చూసుకుంటూ కారుతున్న రక్తాన్ని తన వద్ద ఉన్న గుడ్డతో తుడుచుకుంటూ దీనంగా అలాగే ఉండిపోయాడు కనకరాజు. ఈ సంఘటన ప్రయాణికుల మనసును కలచివేసింది. కేసు నమోదు చేసి, 108లో అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు.