cylinder price hikes
-
గ్యాస్ ‘బండ’ భారం.. మరో రూ.25 పెంపు
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతుంటే, మరో పక్క గృహావసర గ్యాస్ సిలిండర్ ధర కూడా వాటితో పోటీ పడుతోంది. ఈ నెలలోనే సిలిండర్‌పై రూ.75 మేర పెంచిన ఆయిల్ కంపెనీలు గురువారం మళ్లీ మరో రూ.25 మేర పెంచేశాయి. దీంతో హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.846.50కి చేరింది. ఒక్క నెలలోనే సిలిండర్ ధర ఏకంగా రూ.100 మేర పెరిగిపోవడంతో సామాన్యుడికి చుక్కలు కనపడుతున్నాయి. 3 నెలల వ్యవధిలో రూ. 200 పెంపు నవంబర్‌లో సిలిండర్ ధర రూ.646.50 ఉండగా, డిసెంబర్లో ఏకంగా రూ.100 మేర పెరిగిపోయింది. దీంతో ధర రూ.746.50కి చేరింది. జన వరిలో ఈ ధరలు స్థిరంగా కొనసాగినా, ఫిబ్రవరి 4న రూ.25, 15న మరోసారి రూ.50 చొప్పున ఆయిల్ కంపెనీలు బాదేశాయి. దీంతో సిలిండర్ ధర రూ.821.50కి చేరింది. తాజాగా మళ్లీ రూ.25 పెంచడంతో అదికాస్తా రూ.846.50 అయ్యింది. ఇలా ఈ మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.200 మేర పెరిగిపోయిం దన్నమాట. రాష్ట్రంలో ప్రస్తుతం 1.18 కోట్ల గృహా వసర సిలిండర్లు వినియోగంలో ఉండగా ప్రతిరోజూ సగటున 1.20 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు. ఈ సిలిండర్‌పై ఇవ్వాల్సిన సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా కోత పెడుతూ వస్తోంది. గత ఏడాది మార్చి ముందు వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.220 వరకు సబ్సిడీ జమ చేసిన కేంద్రం.. ప్రస్తుతం కేవలం రూ.40 మాత్రమే జమ చేస్తోంది. అంటే వినియోగదారుడిపై సబ్సిడీ కోత భారం ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌కు రూ.180 పడుతోందన్నమాట. దీనికి ఈ మూడు నెలల్లో పెరిగిన ధరల భారం రూ.200 కలిపితే మొత్తం రూ.380 మేర గ్యాస్ భారం పడినట్లయింది. ఓ పక్క సబ్సిడీలో కోతలు, మరోపక్క ధర పెంపు వాతలతో గృహ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. -
వంటింట్లో గ్యాస్ మంట
సాక్షి,హైదరాబాద్: వంటింట్లో గ్యాస్ మంట పుట్టిస్తోంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలకు అనుగుణంగా ధరలను పెంచుతుండటంతో సిలిండర్ ధర ఆకాశానికి చేరుతోంది. రెండు నెలల వ్యవధిలోనే గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర రూ.125 మేర పెరిగింది. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా రాయితీలు చెల్లించాల్సిన కేంద్రం... వాటిని ఇవ్వకపోవడంతో సామాన్యులపై మోత తప్పడం లేదు. గతేడాది నవంబర్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 646.50 ఉండగా.. చమురు సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఒక్క డిసెంబర్లోనే రూ.100 మేర ధర పెంచాయి. దీంతో ధర రూ. 746.50కు చేరింది. తాజాగా మరోసారి చమురు కంపెనీలు ధరను రూ. 25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సిలిండర్ ధర రూ.771.50కి చేరింది. కరోనా సమయానికి ముందు వరకు ఒక్కో సిలిండర్ ధరలో రూ.520 చొప్పున వినియోగదారుడు చెల్లిస్తే ఆపై ఎంత ధర ఉన్నా ఆ సొమ్మును కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. ఈ లెక్కన రూ.200 నుంచి రూ. 220 వరకు తిరిగి వినియోగదారులకు వచ్చేవి. ఈ విధానాన్ని కేంద్రం తొలి రోజుల్లో విజయవంతంగా నిర్వహించినా క్రమేణా రాయితీ డబ్బుల జమను తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం రూ.40 మాత్రమే వినియోగదారుని ఖాతాలో జమ చేస్తోంది. పెట్రో ధరలు సైతం మండుతూనే ఉన్నాయి. -
షాకింగ్ : వంటగ్యాస్ ధరకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర బుధవారం వరసగా ఆరోసారి ఎగబాకింది. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌కు వరుసగా రూ 144.5, రూ 145 వరకూ పెంచినట్టు ఇండేన్ బ్రాండ్ నేమ్‌తో వంటగ్యాస్‌ను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. తాజా పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ 858, ముంబైలో రూ 829, చెన్నైలో రూ 881, కోల్‌కతాలో రూ 896కు పెరిగాయి. కాగా ఏటా 12 సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీకి అందచేస్తుండగా, అదనపు సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా ప్రభుత్వం నెలవారీ సబ్సిడీలను వినియోగదారులకు అందిస్తోంది. -
సిలిండర్‌పై రూ.62.50 పెంపు
సాక్షి, సిటీబ్యూరో : ఒకవైపు చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు... మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న సిటీజనులపై వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధర రూ.62.50కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రేటర్ ప్రజలపై సుమారు రూ.11,549 కోట్ల అదనపు భారం పడుతోంది. వంటగ్యాస్ ధర పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1024.50కి చేరింది. ఇప్పటికే డీబీటీ పథకం పుణ్యమా అంటూ.. సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం పన్ను రూపంలో రూ.27.97 అదనంగా వసూలు చేస్తోంది. పైగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ రూ.25లకు కూడా ఎగనామం పెట్టింది. ఫలితంగా వినియోగదారులు ఒక్కో రీఫిల్లింగ్‌పై రూ.52.97 అదనంగా భరిస్తున్నారు. తాజాగా పెరిగిన ధర రూ.62.50తో కలుపుకొంటే మొత్తం రూ.115.47 అదనపు భారం పడినట్లయింది. జనంపై అదనపు భారం గ్రేటర్లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 10.75 లక్షల కనె క్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. అయితే అనుసంధానమైన వినియోగదారులపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర, అమ్మకం పన్ను వడ్డన, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఎగవేతతో సగటున రూ.1241 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇకపోతే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కాని సుమారు 15.30 లక్షల మంది వినియోగదారులపై సగటున మరో రూ. 10,308 కోట్ల అదనపు భారం పడనుంది. వీరికి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఒక్కో రీఫిల్లింగ్‌పై వర్తించే సబ్సిడీ రూ.558.30కి తోడు పెరిగిన ధర, రాష్ట్ర ప్రభుత్వ అమ్మకం పన్ను వడ్డన, సబ్సిడీ ఎగవేత కలుపుకొని మొత్తం మీద సిలిండర్‌కు 673.77 పైసలు చొప్పున అదనపు భారం పడనుంది. దీంతో గ్రేటర్ వాసులు వంటగ్యాస్ అంటేనే బెంబెలెత్తిపోతున్నారు.