D rama naidu
-
రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్
‘‘రామానాయుడుగారంటే మాకు ఓ హీరో, రోల్‌మోడల్. దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తులు. సినీ పరిశ్రమ, దాని అనుబంధ కార్యాలయాలన్నీ అభివృద్ధి కావడానికి రామానాయుడుగారే కారణం. ఆయన జయంతిని మేం గొప్పగా జరుపుకుంటాం. ఆయన్ను తలచుకునే సినిమా స్టార్ట్ చేస్తాం. రామానాయుడుగారి వారసుడిగా అభిరామ్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ –‘‘రామానాయుడుగారు లేకుంటే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఫిలిం నగర్, హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. రామానాయుడుగారి పేరుతో ఏది మొదలుపెట్టినా అది సక్సెస్. చెన్నారెడ్డి, దాసరి నారాయణరావు, రామానాయుడుగార్లు ఫిలింనగర్‌కు దేవుళ్లులాంటి వారు’’ అని అన్నారు. ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. వారి ఫాలోయర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్లో మంచి సినిమాలు రావడానికి నాయుడుగారి ప్రోత్సాహం ఉంది’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ‘‘మా తాతగారు భౌతికంగా లేకున్నా మానసికంగా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు’’ అన్నారు అభిరామ్. ఈ కార్యక్రమంలో రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్, కేఎస్ రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్య నారాయణ, జె. బాలరాజు రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడి అంత్యక్రియలు
సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల నివాళి సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య ఇక్కడి ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియో ఆవరణలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ఆయన మృతికి గౌరవ సూచకంగా పోలీసులు మూడుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పెద్ద కుమారుడు సురేశ్‌బాబు తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సందర్భంగా సురేశ్‌బాబు, చిన్నకుమారుడు హీరో వెంకటేశ్, మనువడు రాణా కన్నీరు మున్నీరయ్యారు. అంతకుముందు (గురువారం ఉదయం 10 గంటలకు) ఫిలింనగర్‌లోని నివాసం నుంచి రామానాయుడు భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం రామానాయుడు స్టూడియోకు తరలించారు. దారిపొడవునా అభిమానులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేయడం ఒక దశలో పోలీసుల తరం కూడా కాలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, దర్శకుడు కె. రాఘవేందరరావు, నటీనటులు అనీల్‌కపూర్, శ్రీదేవి-బోనీకపూర్, జయప్రద, కృష్ణ, విజయనిర్మల, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, సమంత, ప్రభాస్, విజయ్‌చందర్, తదితరులు రామానాయుడు పార్థివదేహానికి నివాళులర్పించారు.