d roopa
-
ఐపీఎస్ రూప ఫ్యాషన్ ఫోటో షూట్
సాక్షి, బొమ్మనహళ్లి: ఐపీఎస్ అధికారిణి డిఐజీ డి.రూప పేరు వినగానే ముక్కుసూటి పోలీసు అధికారి అని, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టిన నిజాయతి ఐపీఎస్ అని గుర్తుకొస్తుంది. నిత్యం ఖాకీ యూనిఫాంలో దర్శనమిచ్చే ఆమె ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ డిజైన్ చేసిన ముదురు బ్లూ కలర్ ఫ్రాక్ను ధరించి తమ నివాసంలో చేసిన ప్యాషన్ షూట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాను ఐపీఎస్‌నే అయినా, ప్రముఖ మోడళ్లకు తీసిపోను అన్నట్లు ఈ ఫోటో షూట్లో ఐపీఎస్ రూప సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తారు. తమ నివాసంలో తీయించుకున్న ఫ్యాషన్ ఫోటో షూట్ దృశ్యాలు సాధారణ మహిళల కోసమే: రూప ఈ సందర్భంగా తన కాలేజీ రోజులను గుర్తుకు చేసుకున్నారు. మిస్ బెంగళూరు యునివర్సిటి కిరీటం, మిస్ దావణగెరె అవార్డును విద్యార్థినిగా ఉన్న రోజుల్లో గెలుచుకున్నట్లు డి.రూప తెలిపారు. ఫోటో షూట్‌పై స్పందిస్తూ ‘నేనేమి పోలీసు విధులను వదిలి ఫ్యాషన్ షోలకి వెళ్ళలేదు. ఒక సాధారణ మహిళ సైతం ఫ్యాషన్ షోలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్ మోడల్స్, సినిమా నటీమణులు మాత్రమే ఫ్యాషన్ షోలకు పరిమితం కాదని అందరికీ తెలియడం కోసం నేను కెమెరా ముందుకొచ్చాను’ అని చెప్పారు. ఈ సమయంలో తనతో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఫోటో షూట్ చేయించుకున్నారని అన్నారు. కాలేజీ రోజుల్లో అందాల టైటిల్స్ గెలుచుకున్న విషయాలను ఎవరికీ చెప్పుకోనని అన్నారు. గడిచిన 10 నెలలుగా ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ తనకు సలహాలు ఇచ్చిన తరువాత ఈ ఫోటో షూట్ చేశానని రూప తెలిపారు. -
మీవల్లే జైల్లో శశికళ.. రూప సెల్ఫీపై చర్చ
సాక్షి, బెంగళూరు : శశికళ పరప్పన అగ్రహార జైల్లో శశికళ వీఐపీ సదుపాయాలపై నివేదికతో ఐపీఎస్ అధికారిణి రూప వార్తల్లోకెక్కారు. అప్పటి నుంచి తరచూ ఆమె వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని పొగుడుతూ ఆయనతో దిగిన ఓ సెల్ఫీని ఆమె ట్వీట్ చేయగా.. అది చర్చనీయాంశమైంది. ‘మీరు(సుబ్రహ్మణ్య స్వామి) చాలా గొప్ప వ్యక్తి సార్. మీరే గనుక ఫిర్యాదు చేయకుంటే మాత్రం ఆ వ్యక్తి అసలు జైలుకి వెళ్లే వారు కాదేమో. మీ స్ఫూర్తితోనే ఆమె జైల్లో చేసిన అక్రమాలు నేను బయటపెట్టా’ అని రూప ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌పై పలువురు విమర్శలు మొదలుపెట్టారు. ‘మీరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అంటూ ఓ వ్యక్తి రీట్వీట్ చేయగా... రూప దానికి స్పందించారు. ‘నేను జైలు రిపోర్టు అందజేయగానే నన్ను బదిలీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక పోలీస్ శాఖ ప్రవర్తించింది. అప్పుడు ఎవరూ ప్రశ్నించరు. కానీ, ఇప్పుడు ఓ స్పూర్తిదాయాక వ్యక్తితో ఫోటో దిగితే రాజకీయాలు చేస్తున్నారు. ఇది సరికాదు’ అని ఆమె పేర్కొన్నారు. కాగా, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో తేనెతుట్టే కదిలింది. సుమారు రెండు దశాబ్దాలపాటు జరిగిన విచారణ అనంతరం బెంగళూరు కోర్టు గతేడాది ఫిబ్రవరిలో జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళను కోర్టు దోషులుగా తేల్చింది. అయితే అప్పటికే జయలలిత మరణించగా, శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే శశికళకు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్ అందిందని.. అందుకోసం అధికారులు రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ జైల్లో డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక హోం శాఖ.. ఆపై రూపను వేరే విభాగానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
నిజాయతీపరులకు వేధింపులా..?
విజయపుర (బెంగళూరు): కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రంలో ధనవంతులకు స్వర్గం చూపిస్తు, నిజాయతీపరులకు నరకాన్ని చూపిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. అంతేకాకుండా మోసగాళ్లను, లంచగొండ్లను అడ్డుకునే అధికారులను బదిలీలతో బలి చేస్తున్నారని ఆయన అన్నారు. దేవనహళ్ళి తాలూకా విజయపుర సమీపంలో ఉన్న ఆవతి గ్రామంలో పార్టీ సమావేశంలో అశోక్ పాల్గొని మాట్లాడారు. జైళ్ళ శాఖ డి.రూపా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక నూటికి నూరుశాతం వాస్తవాలను తెలిపిందని చెప్పారు. ఆ విషయాలు మొత్తం మీడియాలో వచ్చాయి. జైలు అధికారులకు లంచాలను ఇస్తు కావలసిన సకల సౌకర్యాలను ఖైదీలు పొందుతున్నారని, ఇలాంటి వారిపైన కఠిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే నిజాయతీపరురాలైన రూపకు బదిలీనే దక్కిందని మండిపడ్డారు. ఇది ప్రభుత్వం చేతగాని తనం వల్లనే జరిగిందని ఆరోపించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ, కరీం తెల్గీల నుంచి డబ్బులు తీసుకుని వారికి అన్ని సౌకర్యాలను అందజేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. డీఎస్పీ గణపతి, కలెక్టర్ శిఖా విషయంలో కూడా ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదని అన్నారు. దేశంలోనే ఉత్తమ సేవలను అందిస్తున్న కర్ణాటక పోలీసులకు నల్లటి మచ్చ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిందని అన్నారు.