నూతన వేతన ఒప్పందం కార్మిక విజయం
ఆమదాలవలస రూరల్ (ఆమదాలవలస) : నూతన వేతన ఒప్పందం సాధించడం కార్మికుల విజయంగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. దూసి గ్రామంలో ఉన్న కాన్‌కాస్ట్ ఫ్యాక్టరీ ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 124 రోజులుగా చేస్తున్న కార్మికుల పోరాటానికి యాజమాన్యం దిగివచ్చిందని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం కోసం యాజమాన్యం స్పందించడంతో బుధవారం రిలే నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు ఆయన నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయడం వల్లే నూతన వేతన ఒప్పందం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై రూ.4,650 పెరిగిందని, డీఏ పాయింట్‌కు రూ.4.50 ఇవ్వడానికి, ఎలక్ట్రికల్, మెకానికల్‌లో పని చేస్తున్న 42 మంది కార్మికులను రెగ్యులర్ చేయడానికి కాన్‌కాస్ట్ యాజమాన్యం అంగీకరించినట్లు పేర్కొన్నారు. కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయడానికి కూడా ఒప్పందం కుదిరిందన్నారు. కార్మికులు కలిసికట్టుగా పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. కార్మికుల పోరాటానికి మద్దతు ఇచ్చిన యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్మికులు బమ్మిడి రమణ, రామచంద్రరాజు, టి.రాజు, సత్యన్నారాయణ, పి.రాజశేఖర్, పి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీను, బి.అప్పారావు, తారకేశ్వరరావు, రాఘవేంద్రరావు, పి.నాగరాజు, కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.