పాతికేళ్ల దాసి
తెలుగులో ఇదొక స్పెషల్ కేటగిరీ సినిమా. సమాంతర చిత్రాలు తీయడంలో మనకూ ఓ మొనగాడు ఉన్నాడని గర్వంగా చెప్పుకునేలా చేసిన సినిమా. విశాలమైన గడీల్లోని ఇరుకుతనాన్ని, ఆ వెలుతురులో ఇరుక్కున్న చీకటిని నగ్నంగా ఆవిష్కరించిన సినిమా. బి.నరసింగరావు చేసిన ఈ సెల్యులాయిడ్ సృజనకు ఇప్పుడు పాతికేళ్లు నిండాయి.‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆఫీస్. బి.నరసింగరావుని ఫేమస్ జర్నలిస్ట్ జి.కృష్ణ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ‘మా భూమి’ నిర్మాతగా, ‘రంగుల కల, ది సిటీ (డాక్యుమెంటరీ), ‘మావూరు (డాక్యుమెంటరీ) దర్శకునిగా నరసింగరావు పేరు మార్మోగిపోతున్న సమయమది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చుని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు.
జి.కృష్ణ తను ఒకప్పుడు గద్వాల్ సంస్థానానికి వెళ్లినప్పటి అనుభవాలు చెప్పసాగారు. ఆ గడీలో ఆయనకో స్పెషల్ రూమ్ ఇచ్చారట. ఓ అందమైన అమ్మాయి నీళ్లు తీసుకువచ్చి కాళ్లు కడగబోయిందట. జి.కృష్ణ కంగారుపడి ‘‘ఇదేంటి!’’ అనడిగారట. ‘‘ఇక్కడకు వచ్చినవాళ్లు మాతో చాలా చేయించుకుంటారు. మీరు కాళ్లు కడిగించుకోవడానికే ఇబ్బంది పడిపోతారేంటి?’’ అందట. ఆమె ఒక దాసి. ఈ ఇన్సిడెంట్ బి.నరసింగరావుని చాలా రోజులపాటు వెంటాడింది. నరసింగరావు ఇంట్లో కూడా దాసీలు ఉండేవారు. అయితే వారిని గౌరవంగానే చూసేవారు. తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాసీ వ్యవస్థ గురించి ఆరా తీశారు.
కొన్ని నెలల తర్వాత... బొంబాయిలో ఉన్న స్నేహితుని దగ్గర్నుంచీ ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘ఫలానా వాళ్లు సినిమా చేయాలనుకుంటున్నారు. డెరైక్టర్ గురించి సెర్చ్ చేస్తుంటే నీ పేరు రికమెండ్ చేశాను. రెండ్రోజుల్లో వాళ్లకు స్టోరీ ఐడియా చెప్పాలి’’ అనేది ఆ టెలిగ్రామ్ సారాంశం.రెండ్రోజుల్లో కథ ఎలా? నరసింగరావు ఆలోచనలో పడ్డారు. ఆ సాయంత్రం కవి దేవీప్రియతో బోట్ క్లబ్లో స్టోరీ సిట్టింగ్‌కి కూర్చున్నారు. ఏ ఐడియా తట్టలేదు. ఇక బయలుదేరదామనుకుంటున్న సమయంలో నరసింగరావుకి ‘దాసి’ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. రచయిత కె.ఎన్.టి.శాస్త్రిని తెలంగాణ మారుమూలల్లోకి వెళ్లి దాసీలను ఇంటర్వ్యూలు చేసి తీసుకు రమ్మని పురమాయించారు. తీరా ఇంటర్వ్యూలు చూసి నరసింగరావు షాక్. తానేదో ఓ పరిధిలో ఊహిస్తే, అంతకుమించి డెప్త్‌తో చాలా వేదనాభరితంగా, దారుణాతి దారుణంగా ఉన్నాయి దాసీల గాథలు.
సాదాసీదా వ్యవహారం కాదని అర్థమైపోయిందాయనకు. బోలెడంత రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన సమయంలో... వాళ్లకి సహాయకులుగా జాగిర్దార్లు ఉండేవాళ్లు. వాళ్ల కింద ఊరికో దొర పెత్తనం. ఆ దొరల దయాదాక్షిణ్యాల మీదే ప్రజల బతుకులు. దొరగారికి పెళ్లయితే, వధువు వెంట తోడులాగ, తోకలాగా ఓ దాసీ వస్తుంది. ఇంటిపని, వంట పని, చివరకు వంటి పని కూడా చేయాల్సిందే. అడిగినవారికి అడిగిందల్లా ఇవ్వడమే దాసీ పని. 24 గంటలూ అంతే. విశ్రాంతిలేని జీవితం. కఠిన కారాగారవాసం. నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న పాపం. అలాంటి ఓ దాసీ కథ ఇది. పేరు కమలాక్షి.ఫైనల్‌గా స్క్రిప్ట్ రెడీ. ఆ తర్వాత మరో యజ్ఞం మొదలు. ‘దాసి’గా ఎవరు బావుంటారు? అన్వేషణ మొదలైంది. అప్పుడే నేషనల్ అవార్డులు అనౌన్స్ చేశారు. బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన తమిళ సినిమా ‘వీడు’లో యాక్ట్ చేసిన ‘అర్చన’కు ఉత్తమ నటి అవార్డు.
ఆమె ఫొటో చూడగానే ‘దాసి’ పాత్రకు తనే కరెక్ట్ అనిపించింది. ఇలాంటి సినిమాలంటే అర్చనకు ఒకటే హుషారు. తను రెడీ.ఈ సినిమాకి నిర్మాత కాని నిర్మాత ఎవరంటే - హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం. 85 శాతం ఫైనాన్స్ వాళ్లదే. ఫస్ట్ దూరదర్శన్‌లోనే ప్రసారమయ్యాకే, రిలీజ్‌లూ గట్రా. అదీ అగ్రిమెంట్. నల్గొండ జిల్లాలో చింతపల్లి అనే ఊళ్లో ఓ గడీ ఉంది. గడీ అంటే దొర నివాస భవనం అన్నమాట. సినిమా అంతా అక్కడే షూటింగ్. ఖర్చు పదకొండున్నర లక్షలు. దీనికి మ్యూజిక్కూ నరసింగరావే. ‘దాసి’ పక్కాగా ముస్తాబయ్యింది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక ఇదేదో తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందని నరసింగరావుకి అర్థమైపోయింది. జాతీయ అవార్డులకు పంపించారు.
హిందీ, బెంగాలీ, మలయాళీ సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసి విజేతగా వెలిసింది ‘దాసి’. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా అయిదు అవార్డులు. 1989 ఉత్తమ ప్రాంతీయ చిత్రం... ఉత్తమ నటి (అర్చన)... ఉత్తమ ఛాయాగ్రహణం (ఎ.కె.బీర్)... ఉత్తమ కళాదర్శకత్వం (వైకుంఠం)... ఉత్తమ వస్త్రాలంకరణ (సుదర్శన్). తెలుగు సినిమా పంట పండింది. మనసు నిండింది. ఎప్పుడూ చూడలేదు ఇన్ని అవార్డులు. మళ్లీ చూస్తామోలేదో కూడా తెలీదు. పండగే పండగ. ‘దాసి’కి ప్రశంసల వెల్లువ. అటు నేషనల్ వైడ్. ఇటు ఇంటర్నేషనల్ వైడ్. ఎక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినా ‘దాసి’ ఉండి తీరాల్సిందే. దాదాపు 20 ఫెస్టివల్స్‌లో ‘దాసి’ హవా నడిచింది. దూరదర్శన్‌లో ‘దాసి’ ప్రసారమైనప్పుడు చూడాలి... అంతా టీవీల ముందే.అసలు దాసిగా అర్చన నటనకు వందకు నూటయాభై మార్కులు వేసి తీరాల్సిందే! అంతకన్నా గొప్పగా ఎవ్వరూ చేయలేరన్నట్టుగా చేసిందామె. మిగతా ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ ప్రాణం పెట్టేశారు.
ఈ చిత్రానికి అసలు హీరో నరసింగరావే. ఇలాంటి కథ ఎంచుకోవడమే రిస్కు అనుకుంటే, ఈ తరహాలో తీయడం మహా మహా రిస్కు. స్పైసీగా, చాలా బీభత్సంగా ఉండే దృశ్యాలను కూడా కళాత్మకంగా తీశారాయన. అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే ఎక్స్ట్రార్డినరీ. దాసి నెల తప్పుతుంది. దొర భార్య గర్భం తీయించుకోమని ఆజ్ఞ ఇస్తుంది. దొర చెల్లెలు గర్భవతి అయిన సందర్భంగా పండగ జరుగుతుంటే, ఇటేమో కమలాక్షి గర్భ విచ్ఛిత్తి. బాధ భరించలేక కేకలు పెడుతుంది. ఆ కేకలన్నీ ఆ సంబరంలో కలగలిసిపోతాయి. దాసీల కన్నీళ్ల వెనుక ఉన్న రక్తపాతాన్ని, గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాన్ని చాలా అద్భుతంగా ఒడిసిపట్టి 24 ఫ్రేముల్లో నింపారు. సినిమాలో ఎక్కడా అతి కనపడదు. మెలోడ్రామా ఉండదు. ఓ గడీలో కెమెరా పాతేసి తీసినంత లైవ్లీగా అనిపిస్తుంది. ఈ ఒక్క సినిమా చాలు... నరసింగరావు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడానికి. ఒక్కటి మాత్రం నిజం... ‘దాసి’లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు.
‘‘ ‘దాసి’ నెగటివ్ పాడైపోయింది. దాన్ని రిస్టోర్ చేసే పనిలో ఉన్నాను. చాలా లక్షలు ఖర్చవుతున్నాయి. శాటిలైట్ చానెల్స్‌లో ప్రసారం చేసే ఆలోచన ఉంది. గుల్జార్లాంటి వాడే ఈ సినిమా వీడియో తన లైబ్రరీలో పెట్టుకున్నాడు. వాళ్లమ్మాయి ఆ వీడియో పోగొడితే, నాకు ఫోన్ చేసి మళ్లీ తీసుకెళ్లారు’’.
- బి.నరసింగరావు
- పులగం చిన్నారాయణ