dacee
-
పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టెప్పులు
పాట్నా: బీహర్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యరాయ్‌ల వివాహం శనివారం కన్నులపండువగా జరిగింది. అంగరంగవైభవంగా జరిగిన ఈ వేడుకకు... రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌లతో పాటు... ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తదితరులు హాజరయ్యారు. వేదికపై ఆశీనులైన నీతీశ్ నవ దంపతులను ఆశీర్వదించారు. దాణా కుంభకోణంలో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ.. తన కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత లాలూ ఇంటా పెళ్లి భాజాలు మోగడంతో అంతా ఆనందంతో ఆడి పాడారు. వివాహ వేడుకల్లో భాగంగా ఓ భోజ్ పురి పాటకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు కుమార్తె మీసా భారతి, కొడుకు తేజస్వీ యాదవ్ లు, నవ దంపతులు స్టెప్పులేశారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ లగావెలు జాబ్ లిప్‌స్టిక్’ అనే భోజ్‌పురి పాటతో పాటు పలు హిందీ పాటలకు రబ్రీదేవి నృత్యం చేశారు. ఈ వివాహం కోసం ప్రత్యేకంగా సాంగ్స్ కంపోజ్ చేయించగా, వాటికి కూడా అందరూ డ్యాన్స్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు రిలే దీక్ష ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: ఎస్సీ వర్గీకరణ జరపాలని డిమాండ్ చేస్తూ మాదిగ ఉద్యోగ సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ ఉద్యోగ సమాఖ్య ఉపాధ్యక్షుడు దాసరి నాగయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జరపాలని మంద కృష్ణమాదిగ నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 17 రోజులుగా జరుగుతున్న దీక్షలకు మద్దతుగా దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రిజర్వేషన్ ఫలాలను పొందడంలో మాదిగలు ఎంతో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. మహా ధర్నాకు తరలివెళ్లాలి.. ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాకు మాదిగ ఉద్యోగులు వారి కుటుంబాలతో తరలిరావాలని సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మురికిపూడి దేవపాల్ పిలుపునిచ్చారు. రిలే దీక్షలో మాదిగ ఉద్యోగ జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు వంగూరి అశోక్, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.నాగరాజు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు కూచిపూడి రామారావు, నగర అధ్యక్షుడు కువ్వారపు మనోహర్‌బాబు, బిరుదు పాపయ్య, జి.రాంబాబు, విజయబాబు, ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు చలివేంద్రం వెంకటేశ్వర్లు, ప్రేమానందం, రావెల వరప్రసాద్, మాదిగ యువసేన జిల్లా మాజీ అధ్యక్షుడు కొమ్మూరి జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.