మళ్లీ ఊపిరి పోసింది
‘‘ఓటు మనింటి ఆడబిడ్డ లాంటిది. ఆడబిడ్డకు పెళ్లి చేసేటప్పుడు... కుర్రాడి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసినట్టే... ఓటు వేసేటప్పుడు ఆ అభ్యర్థి ఎలాంటోడు? కేరక్టర్ ఎలాంటిది? అనే విషయాలు కూడా గమనించాలి... ఇది దాదాసాహెబ్ అంబేద్కర్ మాట. మా ‘రాజ్యాధికారం’ చిత్రానికి ప్రేరణ ఈ మాటే’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన నాలుగు పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని నారాయణమూర్తి చెబుతూ-‘‘ఆరోవారం కూడా విజయవంతంగా ఎనిమిది సెంటర్లలో ప్రదర్శితమవుతోంది. నేను పోషించిన నాలుగు పాత్రల్లో తండ్రి పాత్రకు, అమాయకుడైన అర్జునుడి పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా నాకు మళ్లీ ఊపిరి పోసిన సినిమా ఇది’’ అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై అణచివేత ఆగకపోతే... తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన సినిమా ఇదనీ, ఒక మంచి సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందనాలనీ నారాయణమూర్తి అన్నారు.