జపాన్లో పెను భూకంపం.. సునామీ హెచ్చరిక
జపాన్ ఉత్తరతీరాన్ని బలమైన భూకంపం వణికించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 2011లో పెను భూకంపం, సునామీ వచ్చి అణు విద్యుత్ ప్లాంటు విధ్వంసం జరిగిన ఫుకుషిమా ప్రాంతంలోనే మరోసారి ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు మీద దీని తీవ్రత 6.8గా నమోదైంది. శనివారం తెల్లవారుజామున టోక్యోకు ఈశాన్యప్రాంతంలో ఉన్న ఫుకుషిమా తీరంలో సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం వచ్చినట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది.
సముద్రంలో భూకంపం కారణంగా జపాన్ ఉత్తర తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఫుకుషిమాలోని దై-చి అణు విద్యుత్ ప్లాంటుకు కూడా ఏమైనా ప్రమాదం వాటిల్లిందేమోనని నిపుణులు పరిశీలిస్తున్నారు. 2011లో సంభవించిన భూకంపం కారణంగా జపాన్లో 19వేల మంది మరణించారు. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటు కూడా చాలావరకు కరిగిపోయింది. దీనికారణంగా వెలువడిన రేడియేషన్ ప్రభావం ఇప్పటికీ దాదాపు లక్షమంది ప్రజలపై ఉంది.