మృత్యువులోనూ.. నీ వెంటే..!
చిలుకూరు: ఆరు దశాబ్దాలకు పైగా కలిసి జీవించారు.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసిపోయారు.. మృత్యువు కూడా మమ్మల్ని వీడదీయలేదని నిరూపించుకున్నారు.. ఆ అన్యోన్యదంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య మృత్యుఒడికి చేరిందన్న చేదువార్తను జీర్ణించుకోలేని ఆ భర్త గుండెపోటుతో వెంటనే హఠాన్మరణం పొందాడు. ఈ విషాదకర ఘటన శనివారం రాత్రి చిలుకూరు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బేతవోలు గ్రామానికి చెందిన దొంగరి లింగయ్య(85), దొంగరి అనసూర్యయమ్మ (77) దంపతులు. వీరికి ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. వీరు చిన్న కుమార్తె ఇంట్లో బేతవోలు గ్రామంలో ఉంటున్నారు. అనసూర్యయమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇంటి వద్దనే చిక్సిత పొందుతోంది. శనివారం రాత్రి అనసూరయమ్మ మృతిచెందింది. ఈ వార్త విన్న మూడు నిమిషాలకే ఆమె భర్త లింగయ్య గుండెపోటుతో కన్నుమూశాడు. వృద్ధ దంపతులు ఒక్క సారే చనిపోవడంతో కుటుంబæసభ్యుల రోదనలు మిన్నంటాయి.