సిలిండర్‌పై రూ.62.50 పెంపు
సాక్షి, సిటీబ్యూరో : ఒకవైపు చుక్కలనంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు... మరోవైపు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బెంబేలెత్తుతున్న సిటీజనులపై వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో పిడుగు పడింది. వంటగ్యాస్ ధర రూ.62.50కి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రేటర్ ప్రజలపై సుమారు రూ.11,549 కోట్ల అదనపు భారం పడుతోంది. వంటగ్యాస్ ధర పెంపుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1024.50కి చేరింది. ఇప్పటికే డీబీటీ పథకం పుణ్యమా అంటూ.. సిలిండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అమ్మకం పన్ను రూపంలో రూ.27.97 అదనంగా వసూలు చేస్తోంది. పైగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం భరించిన సబ్సిడీ రూ.25లకు కూడా ఎగనామం పెట్టింది. ఫలితంగా వినియోగదారులు ఒక్కో రీఫిల్లింగ్‌పై రూ.52.97 అదనంగా భరిస్తున్నారు. తాజాగా పెరిగిన ధర రూ.62.50తో కలుపుకొంటే మొత్తం రూ.115.47 అదనపు భారం పడినట్లయింది.
జనంపై అదనపు భారం
గ్రేటర్లో పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ప్రస్తుతం వినియోగంలో 26.05 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 10.75 లక్షల కనె క్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. అయితే అనుసంధానమైన వినియోగదారులపై తాజాగా పెరిగిన గ్యాస్ ధర, అమ్మకం పన్ను వడ్డన, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఎగవేతతో సగటున రూ.1241 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇకపోతే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం కాని సుమారు 15.30 లక్షల మంది వినియోగదారులపై సగటున మరో రూ. 10,308 కోట్ల అదనపు భారం పడనుంది. వీరికి కేంద్ర ప్రభుత్వం పక్షాన ఒక్కో రీఫిల్లింగ్‌పై వర్తించే సబ్సిడీ రూ.558.30కి తోడు పెరిగిన ధర, రాష్ట్ర ప్రభుత్వ అమ్మకం పన్ను వడ్డన, సబ్సిడీ ఎగవేత కలుపుకొని మొత్తం మీద సిలిండర్‌కు 673.77 పైసలు చొప్పున అదనపు భారం పడనుంది. దీంతో గ్రేటర్ వాసులు వంటగ్యాస్ అంటేనే బెంబెలెత్తిపోతున్నారు.