రోగాల పాలు
పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఇష్టంగా తాగేవి పాలు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు మనం తీసుకునే ఆహారంలో ప్రధానమైనవి పాలే. జ్వరమొచ్చినా.. జబ్బు చేసినా పాలే మేలైన ఆహారంగా వైద్యులు సూచించడం పరిపాటి. ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం. ఇందులో అన్ని రకాల పోషకాలుంటారుు.
మరి అలాంటి పోషకాహారం విషత్యులమైతే..? కొత్త జబ్బులు ‘కొని’తెచ్చుకోవడమే! ఇప్పుడు మనం తాగుతున్నవి అచ్చంగా అలాంటి పాలే. ఈమధ్య కాలంలో పాలల్లో కల్తీ వల్ల అనేక రోగాలు వస్తున్నట్టు పలు పరీక్షలో నిర్దారణ అయ్యింది. ఇటీవల కల్తీ పాల అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ కల్తీ పాల గురించి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
- ముకరంపుర
నిఘా ఏదీ..?
జిల్లాలోని ఒక ప్రముఖ డెయిరీ ప్రతి రోజు పాడి రైతుల నుంచి నలభై వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. నిత్యం ఆ డెయిరీ అమ్మకాలు చూస్తే రెట్టింపు స్థాయిలో ఉంటోంది. పైగా పాలల్లో వెన్నతీసి నెయ్యితో పాటు పలు రకాల పాల పదార్థాలను తయారు చేసి విక్రయిస్తోంది. ఇదే డెయిరీలో పాలల్లో పెద్ద ఎత్తున రసాయనాలు కల్తీ చేస్తున్నట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
రసాయనాలతో అనర్థాలు
ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు, ఇతర రసాయనాల వినియోగంతో వచ్చిన పాలు తాగిన వారిలో అనేక రుగ్మతలు కనిపిస్తున్నారుు. మానవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అమ్మాయిలు పదేళ్లలోపే రజస్వల కావడం, తొందరగా యుక్తవయస్సుకు రావడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదముంది. కాల్షియం ఆక్సైడ్తో పేగులు చిల్లులు పడే అవకాశముంది. ఎముకల పౌడర్ సైతం జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. డిటర్జెంట్లతో కాలేయం, యూరియాతో కిడ్నీ, రసాయనాలతో ప్రాణాంతక సమస్యలు ఉత్పన్నమవడానికి కారణమవుతున్నాయి.
ముకరంపుర :
గతంలో ప్రతీ ఇంట్లో ఓ పాడి ఆవో, పాడి గేదో ఉండేది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా తప్పనిసరిగా పాలు, పెరుగు తినేవారు. కానీ నేడు పాలన్నీ ప్యాకెట్లుగా మారుతున్నారుు. వ్యాపారులు తమ స్వలాభమే లక్ష్యంగా పాల కల్తీ, కృత్రిమ పాల తయూరీకి తెగబడుతున్నారు. పశువుల పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాలల్లో సూక్ష్మజీవులు చేరి అవి తాగిన వారిని అనారోగ్యం పాలు చేస్తున్నారుు.
అవసరం కొండంత.. ఉత్పత్తి గోరంత
జిల్లావ్యాప్తంగా 4 లక్షల గేదెలు, 75 వేల ఆవులుండగా 38 లక్షల వరకు జనాభా ఉన్నారు. వీరందరికీ రోజూ ఆరు లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ జిల్లాలోని 12 ప్రైవేట్ డెయిరీలు గ్రామీణ ప్రాంతాల్లోని పాలకేంద్రాలు, రైతుల నుంచి నిత్యం 2.50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నాయి. వాటిని ప్యాకెట్ల రూపంలోకి మార్చి విక్రయిస్తున్నాయి. దీంతో అవసరానికి ఉత్పత్తికి లంకె కుదరడం లేదు. దీనిని ఆసరాగా తీసుకున్న కొంతమంది కృత్రిమ పాలు తయూరు చేసి, మరికొందరు ఉన్న పాలను కల్తీ చేసి అమ్మకాలు జరుపుతున్నారు.
కల్తీతో ఒకటికి మూడు..
ప్రైవేట్ పాల వ్యాపారులు లీటరు పాలను క్షణాల్లో మూడు లీటర్లుగా మారుస్తున్నారు. దీనికి వారు పలు పద్ధతులు అవలంబిస్తున్నారు. ఫ్లోరైడ్ నీటిని కలపడం వల్ల 30 శాతం, స్కిన్ మిల్క్ పౌడర్ వినియోగించి 30 శాతం, కాల్షియం కార్బొనేట్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి 30 శాతంగా కల్తీ చేస్తున్నా రు. పాలు తెల్లగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్లు, వైట్ పెరుుంట్లు వాడుతుండగా, పగలకుండా ఉండేందుకు తినే సోడాతో పాటు సోయా, ఆముదం నుంచి వచ్చే నూనెలు కలుపుతున్నారు. ఇలా జిల్లాలో నిత్యం వేలాది లీటర్ల పాలు కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు.
68 శాతం కలుషితం
ఆహారభద్రతా ప్రమాణాల సంస్థ దేశవ్యాప్తంగా 1783 పాల శాంపిళ్లు పరిశీలించి అందులో 68 శాతానికిపైగా పాలు కలుషితమని తేల్చింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే పాలు ఎక్కువగా కలుషితం అవుతున్నాయని గుర్తించింది. రెండు నెలల క్రితం జిల్లాలోని 12 పాల డెయిరీల్లో కేంద్ర ఆరోగ్య సంస్థ తనిఖీలు నిర్వహించి వాటిలో తయారవుతున్న పాల ప్యాకెట్లలోనూ కల్తీ ఉన్నట్లు నిర్దారించింది.
అత్యాశతో ఆరోగ్యానికి హాని
పశువులు పాలు ఇవ్వనప్పుడు, దూడ చనిపోయిన సందర్భంలో పశువుల పెంపకందారులు ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతున్నారు. దీనికితోడు పశువులకు జబ్బు వచ్చినపుడు యూంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. అలాగే అధిక పాల ఉత్పత్తి కోసం, పాడి ఆవులు, గేదెలు త్వరగా చూడికి రావడం కోసం ఆక్సిటోసిన్ వంటి హార్మోనల్ ఇంజక్షన్లు ఉపయోగిస్తున్నారు. తద్వారా ఆక్సిటోసిన్ హర్మోన్లు, యూంటీబయాటిక్స్ మనుషుల్లోకి చేరి అనారోగ్యం పాలవుతున్నారు. పాలు ఎంత మరిగించినా బాక్టీరియాలు అలాగే ఉండే యూంటీబయాటిక్స్, నాన్ ఫుడ్ గ్రేడ్ కెమికల్స్ వాడుతుండడంతో సమస్యలకు దారితీస్తోంది.
సూక్ష్మజీవులతో ప్రమాదం
ప్రైవేట్ డెయిరీ పాలల్లో అధిక శాతం కలుషితాలు ఉంటున్నాయని గతంలో పరిశోధనలు వెల్లడించాయి. పశువుల నుంచి పితికిన పాలను సాధారణ ట్యాంకర్ల ద్వారా శీతలీకరణ కేంద్రాల కు చేర్చుతున్నారు. ఈ అయిదారు గంటల వ్య వధిలో పాలలో సూక్ష్మజీవులు చేరుతున్నాయి. అక్కడ కూడా పాల ప్యాకెట్లను అననుకూల వాతావరణంలో ఉంచుతున్నారు. ఫలితంగా సూక్ష్మజీవుల పరిమాణం అనేక రేట్లు పెరిగి చివరికి పాలు విషపూరితమవుతున్నాయి.
ఎలా గుర్తించేది ?
పాల కల్తీని నిర్దారించేందుకు జిల్లాలో తగిన ఏర్పాట్లు లేవు. టెస్టు చేసేందుకు పరికరాలు లేవు. ల్యాబ్ లేదు. శాంపిల్స్ సేకరణ లేదు. క్వాలిటీ కంట్రోల్ విభాగమే లేదు. రెవెన్యూ విభాగపు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నా పర్యవేక్షించే వారెవరో తెలీదు. దీంతో ప్రజలకు నాణ్యమైన పాలు తాగే భాగ్యం కలగడం లేదు.
ప్రత్యేక విభాగం అవసరం
పాల నాణ్యత, కల్తీని గుర్తించడానికి జిల్లాలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం, ల్యాబ్ ఏర్పాటు చేయూల్సి ఉంది. అంతేకాకుండా పాల శాంపిల్స్ సేకరించడానికి సిబ్బందిని నియమించాలి. ఇందుకోసం హోమ్ సైన్స్, ఫుడ్ సైన్స్ చదివిన వారిని నియమిస్తే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆ పాలు ప్రమాదకరం..
- లింగారెడ్డి, వైద్యుడు, పశుసంవర్ధకశాఖ
పాలిచ్చే పశువులు జబ్బులబారిన పడినప్పుడు పాలల్లోకి రాని యాంటీబయాటిక్స్ వాడితే మంచిది. ఒకవేళ ఆక్సిటోసిన్, యూంటీబయాటిక్స్ ఉపయోగిస్తే ఆ తర్వాత పశువు నుంచి తీసిన పాలను మార్కెట్లోకి రానివ్వద్దు. వాటిని తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాగే కల్తీపాలు తాగితే కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో సమస్యలు, జీర్ణకోశ వ్యాధులతో పాటు టీబీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత తీసిన పాలు తాగవద్దు. పరిపక్వతకు రాకముందే పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం సరికాదు.