సామాజిక చైతన్యంపై సరళీకరణ ప్రభావం
విజయవాడ (గాంధీనగర్) : సమాజంలోని సామాజిక చైతన్యాన్ని సరళీకరణ విధానాలు దెబ్బతీశాయని సీనియర్ ఐఏఎస్ అధికారి రాజశేఖర్ ఉండ్రు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో 'భారతీయ సమాజంలో కుల, వర్గాలపై లిబరలైజేషన్ ప్రభావం' అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ సరళీకృత ఆర్థిక విధానాలతో గ్రామీణ సామాజిక, సాంస్కృతిక, జీవన విధానం ధ్వంసమైందన్నారు. దళితులు, అణగారిన వర్గాలు, శ్రామికులు తమ ఉనికిని, నైపుణ్యాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సామాజిక సమూహాల జీవన వైవిధ్యాలను, ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగే ప్రజాస్వామిక కార్యాచరణను రూపొందించుకోవాలని సామాజిక ఉద్యమకారులకు పిలుపునిచ్చారు. దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.వినయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాల వెలుగులో పరిపాలన కొనసాగించడం ద్వారానే సామాజిక సమస్యల పరిష్కారానికి సరైన మార్గం దొరుకుతుందన్నారు. సదస్సులో ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, సివిల్ సొసైటీ ఫోరం కన్వీనర్ గోపి, కాపునాడు నాయకులు జి.సుబ్రహ్మణ్యం, బీసీ ఫోరం కన్వీనర్ ఏ.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.