న్యాయం కోసం వెళ్తే.. అచ్చెన్న తన్నాడు..!
దళిత మహిళా ఉద్యోగిని ఆరోపణ..డీఐజీకి ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: న్యాయం కోసం వెళ్తే రాష్ట్ర కార్మిక శాఖమంత్రి అచ్చెన్నాయుడు తనను తన్నారని కొరపాన కల్యాణి అనే దళిత ఉద్యోగిని విశాఖ రేంజ్ డీఐజీ సీహెచ్ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ మేరగ నాగార్జున నేతృత్వంలో ఆమె విశాఖలో ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆర్‌అండ్‌బీలో ఉమెన్ గ్యాంగ్ మజ్దూర్‌గా పనిచేస్తున్న తనను ఎస్ఈ రామచంద్రన్ మూడేళ్లుగా లైంగికంగా వేధిస్తూ ఏడాదిగా జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో గత డిసెంబర్లో న్యాయం కోసం మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు వెళ్లానని, మంత్రి తమగోడు వినకుండా, తనని తన్నడంతో పాటు, తమ కుటుంబ సభ్యులను సెక్యూరిటీ సిబ్బందితో నెట్టివేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి వివరించామన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి రూ.25 వేల నగదు ఇచ్చి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.