తగునా ఇంత వివక్ష?
పది కోట్ల రైతుల కుటుంబాల ఆదాయాల్లో కూడా 23.55 శాతం పెరుగుదల వస్తే డిమాండ్ కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ దుముకుతూ ముందుకు దూసుకు పోతుంది.
సందర్భం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సగటున 23.55% మేరకు పెంచాలన్న ఏడవ వేతన సంఘం నివేదికను ప్రభుత్వం ఆమోదించడంలో విస్పష్టమైన వివక్ష కనిపి స్తోంది. దీని వల్ల ప్రభుత్వంపై 'కొద్దిగా' భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, మన్నికగల వినియోగ వస్తువుల డిమాండ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఇటు పారిశ్రా మిక వర్గాల్లో పెరగబోయే డిమాండు గురించి ఉత్సా హం ఉప్పొంగుతుంటే, ఇటు ఆర్థిక శాఖ స్థూల జాతీయోత్పత్తి అంకెలు పెరుగుతాయని ఆశపడుతోంది.
60 కోట్ల మంది రైతుల లేదా 10 కోట్ల రైతు కుటుంబాల సాగుబడి ఆదాయాలు కూడా 23.55% మేరకు పెరిగితే... ఊహించి చూడండి. డిమాండ్‌లో పెరుగుదల అనూహ్యంగా ఉంటుంది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థే మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వేగంతో దుముకుతూ ముందుకుపోతుంది. అయినా ప్రభుత్వా లన్నీ ఇప్పటికే బాగున్న వారి జేబులనే ఇంకా నింపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? ఈ విషయాన్ని చర్చించడా నికి ఏ ఆర్థికవేత్త లేదా విధానకర్త సిద్ధపడరు. స్వామి నాథన్ కమిటీ సూచించినట్టు, రైతులకు వ్యవసాయ ఖర్చులపై 50% లాభం ఉండేలా కనీస మద్దతు ధరలను నిర్ణయించడం తమ వల్ల కాదని ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ ఒక అఫిడవిట్లో సుప్రీం కోర్టుకు తేల్చి చెప్పే శారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం వరి, గోధుమ మద్దతు ధరలను స్వల్పంగా, క్వింటాల్‌కు రూ. 50 చొప్పున పెంచారు. అంటే దాదాపు 3.6 శాతం పెరుగుదల. అది, నాటి ద్రవ్యోల్బణ భారాన్ని మోయడానికి సైతం సరిపోయేది కాదు. ఈ ఏడాది (2015-16) గోధుమ మద్దతు ధరను క్వింటాలు కు రూ. 75 మేరకు పెంచారు.
47 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 52 లక్షల పెన్షనర్లకు లబ్ధిని కలిగించే ఈ వేతన సవరణ ప్రభుత్వంపై రూ. 1 లక్ష కోట్లకు పైగా ఆర్థిక భారాన్ని మోపుతుందని అంటున్నారు. అయితే, అలాంటి పెంపు దలనే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తే... అప్పుడు వాస్తవంగా పడే భారం కనీసం 3 లక్షల కోట్లకు తక్కువ ఉండదు. రైతులకు, కేంద్ర ఉద్యోగులకు మధ్య ఆదాయ వ్యత్యా సం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. ఉద్యోగి కనీస వేతనం నెలకు రూ. 18,000 కాగా, సగటున నెలకు ఒక రైతు కుటుంబం రూ. 6,000 ఆదాయం మాత్రమే పొందగల దని నేషనల్ శాంపుల్ సర్వే (2014) అంచనా. అందులో రూ. 3,078 వ్యవసాయం నుంచి కాగా, మిగతాది ఇతర పనుల నుంచి అనుబంధ ఆదాయంగా లభించేది. వరుసగా ప్రభుత్వాలు రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే సేద్యాన్ని ఆకలితో మాడేలా చేస్తున్న ఫలితమే ఇది.
ప్రతి పదేళ్లకు ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనా లను ఇంచుమించు 30% మేరకు పెంచుతున్నారని, 1986లో రూ. 750గా ఉన్న కనీస వేతనం రేపు 7వ వేతన సంఘం నివేదికను ఆమోదిస్తే 2016 జనవరి నాటికి రూ. 18,000కు చేరుతుందని మహారాష్ట్ర రైతు నేత విజయ్ జవాంధియా తెలిపారు. అదే కొలబద్దతో గోధుమ కనీస మద్దతు ధరను కూడా పెంచితే... 1985-86లో క్వింటాలుకు రూ. 315గా ఉన్న మద్దతు ధర, రూ. 7,505కు పెరిగి ఉండాల్సింది. అయితే 2015-16 కోతల సీజనుకు రైతులకు ఇస్తామని వాగ్దానం చేసిన గోధుమ మద్దతు ధర రూ. 1,525!
సేకరణ ధర (లేదా మార్కెట్టు ధర) మాత్రమే రైతుకు ఆదాయ వనరుగా ఉండే యంత్రాంగం. రైతుకు వచ్చే నికర రాబడి తన ఉత్పత్తికి లభించే మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటుంది. మరే ఆదాయ వనరు ఉండదు. ఉద్యోగులకుండే డీఏ తదితర, భత్యాల వంటివేవీ వారికి ఉండవు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెల్లకు డీఏ లభిస్తుంది. అది త్వరలోనే మూల వేతనంలో క లుస్తుంది కూడా. ఉద్యోగులకిచ్చే 198 అలవెన్సుల్లో 108 కొనసాగించాల్సినవేనని 7వ వేతన సంఘం భావించింది. అంటే ఉద్యోగుల మూల వేతనం 16% పెరిగితే, అలవెన్సులు 63% పెరుగుతాయి!
సాదాసీదాగా చెప్పాలంటే సమాజంలోని ఒక చిన్న భాగం ఆర్థిక సంపద నిరంతరాయంగా పలురెట్లు పెరుగుతూ పోతుంటే, జనాభాలో అత్యధిక భాగాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. 60 కోట్లకు మించిన లేదా జనాభాలో 52% రైతులను ఉద్దేశపూర్వ కంగానే అట్టడుగు స్థాయికి నెట్టేశారు. ప్రాథమికంగా ఈ కారణంతోనే బెంగళూరులో ఈ నెల మొదటి వారంలో జరిగిన రెండవ ‘జాతీయ రైతు సంఘాల సదస్సు’, ఉద్యోగులకు, రైతులకు మధ్య ఆదాయాల్లో సమాన త్వానికి హామీని కల్పించేవరకు 7వ వేతన సంఘం సిఫారసులను అమలు చేయరాదని కోరింది.
రైతాంగ జనబాహుళ్యానికి ఆర్థిక భద్రతను కల్పిం చడం నేటి తక్షణ ఆవశ్యకత. 7వ వేతన సంఘం ఏ ప్రమాణాల ఆధారంగా ఉద్యోగుల వేతనాలను పెంచిం దో, అదే ప్రమాణాలను మద్దతు ధరలకు కూడా వర్తింప జేయాల్సి ఉంది. రైతులకు, సంఘటిత రంగానికి మధ్య ఆదాయ సమానత్వాన్ని తేవడం కోసం ‘రైతుల ఆదాయ సంఘం’ నియమించాలని నా సూచన. అదేసమయం లో, ప్రతి రైతు కుటుంబానికి నెలసరి ఆదాయ ప్యాకేజీ అందడానికి హామీని కల్పించాలి. అంత వరకు 7వ వేతన సంఘం సిఫారసుల అమలును నిలిపి వేయాలి.
(వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com)