ఎడ్లబండి కింద పడి రైతు మృతి
గూడూరు : మండలంలోని దామరవంచకు చెందిన ఈ సం నాగయ్య (50) అనే రైతు ప్రమాదవశాత్తు ఎడ్లబండి కిం ద పడి మృతిచెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగయ్య, భార్య భద్రమ్మతో కలిసి ఎడ్లబండిపై 8 బస్తాల వరి ధాన్యాన్ని బియ్యం పట్టించేందుకు బయలుదేరారు. గూడూరులో ప్రధాన రహదారిపై వెళ్తుండగా బండి ఎద్దులు బెదురుతూ పరుగెత్తాయి. దీంతో బండిపై ఉన్న నాగయ్య దిగి ఎద్దుల పగ్గాలు పట్టుకొని నడుస్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనాల శబ్దానికి బెదిరిన ఎడ్లు వేగంగా పరుగెత్తడంతో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో బండి అతని చాతిపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడిన నాగయ్యను స్థానికులు సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎంజీఎంకు తరలిస్తుండగా మధ్యలోనే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడి భార్య భద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.