రూ.30 లక్షల ఇసుక డంపులు స్వాధీనం
నల్లగొండ (దామెరచర్ల) : అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన మూడు ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి శివారులో గురువారం జరిగింది.
వాడపల్లి గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టిన రెవెన్యూ అధికారులకు గ్రామ శివారులో మూడు ఇసుక డంపులు కనిపించాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. దామరచర్ల తహశీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుక డంపులను మైన్స్ అధికారులకు అప్పగిస్తామని ఆమె తెలిపారు.