అసోంలో గ్రూప్ ఆఫ్ మిస్ గ్రాండ్స్‌కు చెందిన తీవ్రవాదులు..
ఒంగోలు టౌన్: అసోంలో కిడ్నాపైన ఇంజినీరు దండమూరి నాగమలేశ్వరరావు కుటుంబ సభ్యులు అతని జాడ కోసం విలవిల్లాడుతున్నారు. చీమకుర్తి మండలం కేవీపాలేనికి చెందిన నాగమల్లేశ్వరరావు ఐదేళ్లుగా అసోంలో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీలోని రక్షణ విభాగంలో ఇంజినీరుగాపనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి ఆయన నివాసం ఉంటున్న అసోం రాష్ట్రం హాట్ల్యాండ్ జిల్లా ఎన్సీ హిల్స్‌లోని మైబాం ఏరియా నుంచి గ్రూప్ ఆఫ్ మిస్ గ్రాండ్స్‌కు చెందిన తీవ్రవాదులు అపహరించుకెళ్లారు.
దాదాపు ఐదుగురు తుపాకులతో వచ్చి ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలోని సెక్యూరిటీ గార్డులను భయపెట్టి ఇంజినీర్‌ను కిడ్నాప్ చేశారు. నాగమల్లేశ్వరరావు బంధువులు ఒంగోలులోని రాంనగర్ 1వ లైనులో సాయి అనంతకృష్ణ హైట్స్ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్నారు. కిడ్నాప్ విషయం తెలిసినప్పటి నుంచి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాగమల్లేశ్వరరావుకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మహేష్ సందీప్ ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ రాసి ఇంజినీరింగ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఒంగోలులోని నాగమల్లేశ్వరరావు తోడల్లుడు నరిశెట్టి బ్రహ్మయ్య ఇంట్లో ఉంటున్నాడు. రెండో కుమార్తె లక్ష్మీ మనోజ్ఞ విజయవాడలోని ఓ కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 15న ఇంజినీరు నాగమల్లేశ్వరరావు భార్య రమాదేవి అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాత రెండు నెలల పాటు స్వగ్రామం కేవీ.పాలెం చేరుకున్న నాగమల్లేశ్వరరావు మార్చి నెలాఖరులో అసోంకు విధులు నిర్వర్తించేందుకు వెళ్లారు.
తల్లి మృతి చెంది పుట్టెడు దుఃఖంతో ఉన్న పిల్లలు ప్రస్తుతం తండ్రి కిడ్నాప్‌కు గురవ్వడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం కుమార్తె లక్ష్మీమనోజ్ఞతో నాగమల్లేశ్వరరావు ఫోన్లో మాట్లాడాడు. కుటుంబ సభ్యులతో మాట్లాడ టం అదే చివరిసారి. కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఇంజినీరు తోడల్లుడు నరిశెట్టి బ్రహ్మయ్య ఒంగోలు రూరల్ సీఐ రవికుమార్‌తో, జిల్లా పోలీస్ అధికారులతో సంప్రదిస్తూనే ఉన్నారు.
10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు
నాగమల్లేశ్వరరావు తోడల్లుడు నరిశెట్టి బ్రహ్మయ్య
నాగమల్లేశ్వరరావును కిడ్నాప్ చేసిన గ్రూప్ఆఫ్ మిస్గ్రాండ్స్ తీవ్రవాదులు ఆయన్ను వదిలిపెట్టేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఇలా కిడ్నాప్ చేయడం, డబ్బులు డిమా ండ్ చేసి తిరిగి వదిలివేయడం సర్వసాధారణం. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయన్ను విడిపించాలి. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న పిల్ల లు తండ్రి కిడ్నాప్ ఉదంతంతో తల్లడిల్లుతున్నారు.
నేడు కేంద్ర హోంమంత్రిని కలవనున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
అసోంలో కిడ్నాపైన ఇంజినీర్ దండమూరి నాగమల్లేశ్వరరావును రక్షించాలని కోరేందుకు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవనున్నారు. ఇంజినీర్‌ను సురక్షితంగా కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఆదివారం సాక్షితో మాట్లాడారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైతే అందుకోసం ప్రత్యేకంగా వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రితో సంప్రదించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు.