దంగల్ @ 2000 కోట్లు... నాటౌట్
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా ‘బాహుబలి’ నిలిచింది. అయితే ఇది నిన్నటి మాట. ఇప్పుడీ స్థానాన్ని హిందీ చిత్రం ‘దంగల్’ దక్కించుకుంది. రూ. 2,000 కోట్లు వసూళ్లు సాధించి, ఎక్కువ కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా వరల్డ్‌లో ‘నంబర్ వన్’ స్థానంలో నిలిచింది ‘దంగల్’.
ఇటీవల చైనాలో ఈ చిత్రాన్ని ‘షుయి జియావో బాబా’ పేరుతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ మాత్రమే ఈ చిత్రం 1,200 కోట్లు రాబట్టింది. దాంతో ‘బాహుబలి’ రికార్డుని బీట్ చేసింది. ఇంకా ఈ సినిమా చైనాలో విజయవంతంగా దూసుకెళుతోందట. ఆ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి–2’ని వచ్చే నెల చైనాలో విడుదల చేయనున్నారు. మరి.. ఈ చిత్రం అక్కడ సాధించే వసూళ్లను బట్టి ఎక్కువ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమా ఏది? అనేది డిసైడ్ అవుతుంది. ‘ఇండియన్ సినిమా నంబర్ వన్’ రికార్డు గురించి పక్కన పెడితే ‘దంగల్’ చైనీస్ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకు షాక్ ఇచ్చాయి.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అయిన ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ట్రాన్స్ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ది మూన్’, ‘కుంగ్‌ఫూ ఫాండా’, ‘ది జంగిల్‌బుక్’లతోపాటు వరల్డ్ సూపర్‌హిట్ మూవీ ‘అవతార్’కు మించిన వసూళ్లను చైనా బాక్సాఫీసు వద్ద ‘దంగల్’ రాబట్టుకోవడం విశేషం. చైనాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన నాన్–ఇంగ్లీష్ మూవీగా ఐదో స్థానం దక్కించుకుంది. అక్కడ మిగతా నాలుగు స్థానాల్లో నిలిచిన నాన్–ఇంగ్లీష్ చిత్రాలు ఏంటంటే... ‘ది మెర్మైడ్’ (చైనా), ‘మాన్స్టర్ హాంట్’ (చైనా), ది ఇన్టచ్బుల్స్(ఫ్రాన్స్), యువర్ నేమ్ (జపాన్). ఐదో స్థానంలో ఇండియన్ మూవీ ‘దంగల్’ ఉండటం గర్వించదగ్గ విషయం. గ్రేట్ రెజ్లర్ మహావీర్‌సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా నితీష్ తివారీ డైరెక్షన్లో అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.