అవి ‘ఎయిరిండియా’ మృతులవేనా?
మాంట్ బ్లాంక్‌పై మానవ అవశేషాల గుర్తింపు
గ్రానాబుల్(ఫ్రాన్స్): ఆల్ప్స్ శ్రేణిలో అతిపెద్ద పర్వతమైన ఫ్రాన్స్‌లోని మాంట్ బ్లాంక్‌పై మానవ శరీర భాగాలను గుర్తించారు. ఇవి 50 ఏళ్ల క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో చనిపోయినవారివి అయ్యుండొచ్చని భావిస్తున్నారు. 1950లో మాంట్ బ్లాంక్ పర్వతంపై ఎయిరిండియా విమానం కూలి 48 మంది మరణించారు. మరోసారి 1966లో బాంబే నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 707 విమానం మాంట్ బ్లాంక్ శిఖరాన్ని ఢీకొని అందులోని మొత్తం 117 మంది దుర్మరణం పాలయ్యారు.
విమాన ప్రమాదాల గురించి అన్వేషణలు చేసే డేనియల్ రోచీ... ఈ రెండు ప్రమాదాల్లో చనిపోయిన వారి శరీర అవశేషాలు, విమాన శకలాలకోసం గతకొన్నేళ్లుగా గాలిస్తున్నారు. ఎట్టకేలకు గురువారం ఆయన ఓ చేయి, కాలిలో పై భాగంను కనుగొన్నారు. ఇవి 1966 ప్రమాదంలో చనిపోయిన ఓ మహిళవి అయ్యుండొచ్చనీ, తనకు ఆ విమానంలోని ఓ ఇంజిన్ కూడా కనిపించిందని రోచీ చెప్పారు.
శరీర భాగాలను నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది. అయితే ఇవి ఒకే వ్యక్తికి చెందినవి కాకపోవచ్చనీ, ప్రయాణికులవే అయినా రెండు ప్రమాదాల్లో ఎప్పుడు చనిపోయిన వారివో చెప్పడం కష్టమని స్థానిక అధికారి ఒకరు అన్నారు. ఇదిలా ఉండగా స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ఓ హిమనీనదం వద్ద 75 ఏళ్ల క్రితం అదృశ్యమైనవారి మృతదేహాలను 10 రోజుల క్రితమే కనుగొన్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయగా వారిద్దరూ భార్యాభర్తలనీ, చనిపోయే నాటికి భార్య వయసు 37, భర్త వయసు 40 అని తేలింది.