సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుంది..!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలని ఉందని యంగ్ టెర్రరిస్ట్ డానిష్ ఫరూఖ్ భట్ చెబుతున్నాడు. తాను చేసిన భారీ తప్పిదాన్ని తెలుసుకుని 22 ఏళ్ల ఫరూఖ్ పశ్చాత్తాపపడుతున్నాడు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ సబ్జార్ అహ్మద్ భట్ అంత్యక్రియల్లో పాల్గొనడంతో కొందరు ఉగ్రవాదులతో కలిసి తొలిసారిగా వెలుగులొకి వచ్చాడు ఈ కశ్మీర్ యువకుడు. ఇటీవల పోలీసులు చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన, మార్పులు కార్యక్రమాలతో ప్రేరణ పొందినట్లు చెబుతున్నాడు.
‘కొందరు ఉగ్రవాదులు, దేశ వ్యతిరేఖ శక్తులు నన్ను చెడువైపు ప్రోత్సహించాయి. దాంతో కాలేజీ చదువు మధ్యలోనే వదిలేసి ఉగ్రవాదులతో కలిసి తిరిగాను. మా కాలేజీ (డూన్ పీజీ కాలేజీ ఫర్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) యాజమాన్యం నన్ను మళ్లీ చేర్చుకుని అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. చెడు మార్గాన్ని వదిలేసి మంచివాడిగా బతకాలనుకుంటున్నాను. కొన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా ఉగ్ర గ్రూపులతో సంబంధాలు కొనసాగించాను. భవిష్యత్తులో అలాంటి తప్పులు మళ్లీ చేయను. కుటుంబం కోసం, దేశం పనిచేయాలని నిర్ణయించుకున్నానని’ ఫరూఖ్ భట్ వివరించాడు.
ఫరూఖ్ తండ్రి ఫరూఖ్ అహ్మద్ భట్ మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడి ఫోన్ కొన్నిరోజులు స్విచ్ ఆఫ్ కావడంతో ఎంతో ఆందోళన చెందాను. ఉగ్రవాది అంటూ పేరు పడుతుందని చాలా బాధపడ్డాం. చివరికి పోలీసుల సహకారంతో చెడు విధానాలకు స్వస్తి పలికాడు. వాడు తప్పు తెలుసుకుని మారినందుకు సంతోషంగా ఉందని’ చెప్పారు అహ్మద్ భట్.