ప్రేమంటే ఇలాగే ఉంటుందేమో!
న్యూయార్క్: ప్రేమ అంటే ప్రేమే.. దగ్గరకు చేర్చడమే దాని లక్షణం. గుండెను మెలిపెట్టే శక్తి దానికే ఉంది. దానికి రంగు, జాతి, మతం ఉండవు. అలాగే, ఎదుటి వ్యక్తి అందంగా, ఆహార్యంగా ఉన్నాడా అని కూడా చూడదు. అందరిని తనలో కలిపేసుకుంటుంది. అందరిని హత్తుకుంటుంది. అందుకే అది మాతృప్రేమైనా, పితృప్రేమైనా, బంధువుల ప్రేమైనా, యువతీ యువకుల ప్రేమైనా స్వచ్ఛంగా ఉంటే అమృతంలా మారి శాశ్వతను ఇస్తుంది. ఆ ప్రేమకు అందమైన బానిసలుగా మారుస్తుంది.
ఇలాంటి ప్రేమనే ఓ బాయ్ ఫ్రెండ్ తనపై కురిపించే సరికి ఆ ప్రేయసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎగిరిగంతేసినంత పనిచేసింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. లక్షల్లో ఆ వీడియోను వీక్షించారు. ఆ వీడియో ప్రకారం డౌన్ సిండ్రోమ్ వ్యాధి లక్షణం ఉన్న డానీ గ్రిప్తిస్ అనే యువకుడు అదే వ్యాధి లక్షణం ఉన్న తన గర్ల్ ప్రెండ్ ఆశ్లే గ్రీన్హాగ్ ను ఊహించని గిఫ్ట్ ఇచ్చి అబ్బుర పరిచాడు. గతంలో వారిద్దరి మధ్య సంభాషణ జరిగిన సందర్భంలో తన 21వ పుట్టిన రోజున కచ్చితంగా ఓ రింగ్ తెస్తానని, అది ఆమె చేతికి తొడుగుతానని చెప్పాడు.
కానీ, ఆ ఆశ్లే ఆ విషయం మరిచిపోయింది. అనుకున్నట్లుగానే 21వ పుట్టిన రోజు వచ్చింది. తన గర్ల్ ప్రెండ్ కోసం డానీ కొన్ని గిఫ్టులు తీసుకొచ్చాడు. అందులో ఒక్కో గిఫ్ట్ చూస్తూ సంబరపడిపోతున్న ఆశ్లే చివరిగా అందులో రింగ్ ఉండటం చూసి అబ్బురపడిపోయింది. ఎగిరిగంతేసింది. అతడిని గట్టిగా హత్తుకుని తన హద్దులు చెరిగిన సంతోషాన్ని చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. పుట్టిన రోజుకు వచ్చిన స్నేహితులంతా ఈ దృశ్యం చూసి కనువిందు పొందారు. ఆ రింగ్ ను ప్రేమగా ఆశ్లే చేతికి డానీ తొడిగాడు. గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారంట. సాధారణంగా డౌన్ సిండ్రోమ్ వ్యాధి గ్రస్తులకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉండటంతోపాటు శారీరక పెరుగుదలలో కూడా తేడాలుంటాయి.