టీడీపీలో భూకంపం
వింజమూరు (ఉదయగిరి) : రావిపాడు భూ ఆక్రమణలపై వింజమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు గురువారం బాహాబాహీకి దిగాయి. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు రంగప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల ఒకటో తేదీన రావిపాడు భూ ఆక్రమణలపై సాక్షి దినపత్రికలో ‘నా భూమి’ శీర్షికన ప్రచురితమైన వార్తకు స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలపై తహసీల్దారు టి.శ్రీరాములు రావిపాడు గ్రామ సర్వే నంబరు 272లోని 12.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ను బుధవారం ఏర్పాటు చేశారు. అదేరోజు ఆబోర్డును ఆక్రమణ దారులు తొలగించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేత దంతులూరి వెంకటేశ్వర్రావు బోర్డు ఏర్పాటు విషయమై తహసీల్దారును నిలదీశారు. ఒకదశలో ఆయనను దుర్భాషలాడారు. ఈ సమయంలో అదే పార్టీకి చెందిన ఊటుకూరు ఎంపీటీసీ గురిజాల వెంకటరమణయ్య తన అనుచరులతో తహసీల్దారు చాంబరుకు చేరుకున్నారు. కొందరు నాయకుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని, బోర్డు పీకేసినవారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో దంతులూరు, ఆయన సోదరుడు తాము ఓట్లేసి గెలిపించిన వారే తమను ఇబ్బంది పెడుతున్నారని గురిజాలనుద్దేశించి పెద్దగా కేకలు వేశారు.
దూషణకు కూడా దిగారు. ఎంపీటీసీ కూడా తాను పోరాడేది ప్రజలకోసమని, ప్రభుత్వ భూముల రక్షణ కోసమేనన్నారు. తానెవరికీ భయపడనన్నారు. దీంతో ఇరువర్గాలవారు బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈలోగా ఎస్సై భాస్కరబాబు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని అక్కడనుంచి అందరినీ తరిమి వేశారు. దీనిపై తహసిల్దారు టి.శ్రీరాములు మాట్లాడుతూ తాము చట్టప్రకారమే నడుచుకున్నామన్నారు. బోర్డు తొలగించిన విషయం తమకు తెలియదన్నారు. వీఆర్వొ, ఆర్ఐ నుంచి నివేదిక తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.