‘నా కొడుకు ఇలా చేస్తాడనుకోలేదు.. అదో పీడకలె’
లండన్: తన కుమారుడు ఇలా చేస్తాడని తను అస్సలు ఊహించలేదని బ్రిటన్‌లోని లండన్ నగరంలో ఓ మసీదు వద్ద ముస్లింలను లక్ష్యంగా చేసుకొని వ్యాన్‌తో ఢీకొట్టి తొక్కించిన వ్యక్తి డారెన్ ఓస్బోర్న్ తల్లి చెప్పింది. తన కొడుకు ఉగ్రవాది కాదని, గతంలో ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవరించలేదని తెలిపింది. ‘ఆ రోజు జరిగిన దుర్ఘటనలో బాధితులైన వారందరి తరుపున మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను. అలాంటి సంఘటన ప్రతి తల్లికి ఓ పీడకల. ఏ తల్లి తన కుమారుడిని అలా చూడాలని అనుకోదు’అని ఆమె చెప్పింది.
మరోపక్క, అతడు నివాసం ఉండే చుట్టుపక్కల వారు కూడా డారెన్ మంచివాడని, సన్నిహితుడిగా ఉండేవాడని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఇటీవల కాలంలోనే ముస్లింలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితుడై ఉండొచ్చని భావిస్తున్నారు. లండన్‌లోని ఫిన్స్‌బరీ పార్క్‌లోగల సెవెన్ సిస్టర్ రోడ్డులోని ఓ మసీదు వద్ద ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలపైకి డారెన్ ఓ వ్యాన్‌ను తీసుకొని ఢీకొట్టించి తొక్కేసిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలుకోల్పోగా మరొకరు పన్నెండుమంది గాయాలపాలయ్యారు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులకు పలు విషయాలు తెలిసాయి. ఇటీవల ఓ పబ్‌కు వెళ్లినప్పుడు కూడా డారెన్ అందులో ముస్లింలతో గొడవపడుతుంటే అందులో నుంచి బయటకు తోసేశారని, ఆ తర్వాత అతడి పార్ట్నర్ కూడా అతడిని వదిలేశాడని తెలిసింది. పబ్‌కు వెళ్లిన ప్రతిసారి ముస్లింలను తిడుతుండేవాడని, వారికి ఏదో ఒక రోజు పెద్ద నష్టాన్ని కలగజేస్తానని చెబుతుండేవాడని అదే పబ్‌కు రెగ్యులర్‌గా వెళుతున్న ఓ వ్యక్తి పోలీసులకు చెప్పారు.