'నేను దర్శకేంద్రుణ్ని కాదు..!'
దర్శకేంద్రుడు అంటే ఎవరో తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వందకు పైగా చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్దర్శకుడు రాఘవేంద్రరావును అభిమానులు దర్శకేంద్రుడిగా పిలుచుకుంటారు. ఓ సభా వేదిక మీద ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి, రాఘవేంద్రరావును దర్శకేంద్రుడిగా సంబోధించటంతో ఆ బిరుదు ఆయనకు స్థిరపడిపోయింది. అయితే ఈ జనరేషన్లో దర్శకేంద్రుడు ఎవరనే విషయాన్ని రాఘవేంద్రరావు స్వయంగా ప్రకటించారు.
' అందరూ నన్ను దర్శకేంద్రుడు అంటారు. కానీ నేను ఆ బిరుదుకి అర్హుడుని కాదేమో అని నా అభిప్రాయం. ఇంద్రుడు అంటే ఒక్కడే ఉండాలి. కానీ నా జనరేషన్లో నేను, దాసరి ఇద్దరం ఉన్నాం. కానీ ఈ జనరేషన్లో మాత్రం దర్శకేంద్రుడు రాజమౌళే' అంటూ కితాబిచ్చారు. అంతేకాకుండా తాను ఆత్మకథ రాస్తే దానికి 'నేను దర్శకేంద్రుణ్ని కాదు.. నేను దర్శకుణ్నే' అని పేరు పెడతానని తెలిపారు. శిరిడి సాయి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాఘవేంద్రరావు త్వరలో నాగార్జున ప్రధాన పాత్రలో వెంకటేశ్వరస్వామి కథతో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.