దాసరి లఘుచిత్రాల పోటీ
సాక్షి, సిటీబ్యూరో : దాసరి పుట్టిన రోజు సందర్భంగా లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నామని దాసరి కల్చరల్ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ్ చెప్పారు. మే 4న డా. దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా జరిపే కార్యక్రమాల వివరాలను సోమవారం హైదరాబాద్లో జరిపిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
అనంతరం దాసరి కల్చరల్ కమిటీ కన్వీనర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ‘సామాజిక బాధ్యత కథాంశాలతో తీసిన 5 నుంచి 25 నిమిషాల నిడివిగల చిత్రాలను పోటీకి ఆహ్వానిస్తున్నాం. ఏడాది లోపు తీసిన చిత్రాలు మాత్రమే ఈ పోటీలోకి తీసుకుంటాం. అవి సోషల్ నెట్వర్క్లో ప్రదర్శించిన చిత్రాలైనా పర్లేదు. ఈనెల 26వ తేదీలోపు లఘుచిత్రాలను డీవీడీ రూపంలో చరిత్ర ఆఫీసు, ప్లాట్ నెం.183, గ్రీన్బావర్చీ హోటల్ వెనుక, కమలాపురికాలనీ, హైదరాబాద్-73 చిరుమానాలో అందజేయాలి.
మే 4న హైదరాబాద్లో జరిగే దాసరి జన్మదిన వేడుకలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రభు, లఘుచిత్ర దర్శకుడు కత్తి మహేశ్ కూడా మాట్లాడారు.