అమ్మ పొమ్మంది... ఊరు రమ్మంది
కడుపు తీపి అన్నమాట ఉంది కదా. అలాంటప్పుడు ‘కడుపుచేదు’ కూడా ఉండే ఉండవచ్చు. కానీ ఆ చేదు చాలా అరుదు. ఆ చేదుకు కారణాలూ ఉండవచ్చు. మాతృత్వపు మమకారం ఎలా చేదెక్కిందో తెలిపే కథే చిన్నారి రవళి వ్యథ. రవళి కథ చదవండి. మానవత్వం రవళిస్తే ఆమెను చదివించండి.
రవళికి పన్నెండేళ్లు. చెంపకు చారెడేసి కళ్లు. నోరు విప్పిందంటే ఆరిందాలా కబుర్లు. ఆమె కథ వింటే మాత్రం ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కన్నపేగే కాలనాగైన గాథ ఆమెది. కడుపున పడగానే కన్నతండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె తల్లి మానసికంగా దెబ్బతింది. చివరకు కన్నకూతురినే కట్టేసి కొట్టేంతగా కరడుగట్టిపోయింది. అదే రవళికి శాపమైంది. కడుపులో పెట్టుకోవాల్సిన తల్లి కడుపు మాడ్చింది. కాళ్లూ చేతులు కట్టేసి, గొడ్డుకారం పెట్టి, గొడ్డును బాదినట్లు బాదింది. కన్నతల్లి చేతిలోనే కష్టాలు పడుతున్న ఆమెను ఊరు ఊరంతా ఏకమై ఆదుకుంది. కన్నీళ్లు పెట్టించే రవళి కథ ఆమె మాటల్లోనే...
అమ్మ నుంచి కాపాడేవారు లేరు...
నా పేరు సంగిశెట్టి రవళి. మాది నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం. నాన్న పేరు దేవదాసు. అమ్మ పుష్ప. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మమ్మల్ని విడిచేసి వెళ్లాడు. అప్పట్నుంచి అమ్మకు మానసిక సమస్య. పిచ్చిపిచ్చిగా చేస్తుండేది. నన్ను బాగా కొట్టేది. దాంతో మా అమ్మమ్మే నన్ను బడికి పంపుతుండేది. మతి సరిగా లేక మా అమ్మమ్మనూ కొట్టేది మా అమ్మ. అయినా అమ్మమ్మ లెక్కచేయలేదు. మా అమ్మ చేతులకు తన చేతులు అడ్డువేసి నన్ను ఇంగ్లిష్ మీడియంలో చదివించింది. ఐదేళ్ల కిందట మా అమ్మమ్మ చనిపోయింది. కిడ్నీలు పాడైపోయి చనిపోయిందని ఊళ్లోవాళ్లు అనుకున్నారు. అప్పట్నుంచీ నా జీవితమే మారిపోయింది.
పని చేసినా కొట్టడమే... చేయకున్నా కొట్టడమే...
అమ్మమ్మ చనిపోయాక మా అమ్మ నన్ను బడికి పంపలేదు. పనికి పంపింది. ఐదేళ్ల నుంచీ పనికి పోతున్నా. మనసు బాగలేకపోవడం వల్లనో ఏమోగానీ... నన్ను ఇంట్లోకి తోలి, కాళ్లూచేతులూ కట్టేసి, కంట్లో కారం పెట్టి కొట్టేది మా అమ్మ. ఒకరోజు ఆమె కొడుతూ ఉంటే అమెను అడ్డుకోడానికి ప్రయత్నించా. ఆ టైమ్‌లో అమ్మ కాలు విరిగింది. నేను పనిలోకి వెళ్తే వచ్చే పైసలతోనే ఆమె కాలిని బాగుచేయించా. అమ్మ అంతగా కొడుతుంటే తట్టుకోలేకపోయేదాన్ని. పైసలు తీసుకోకపోయినా... మా మామలు మా పైసలు తీసుకున్నారని వాళ్లపై కేసులు పెట్టింది మా అమ్మ. వాళ్ల నుంచి నలభైవేలు తీసుకుంది. అవి పూర్త్తయ్యే వరకూ ఖర్చు పెట్టింది. నేను పత్తి ఏరడానికి పోయేదాన్ని. అల్లం తీసేందుకూ, పొలాలకు మందు పెట్టేందుకు వెళ్లేదాన్ని. పైసలు తేవడం తేవడమే. అమ్మ కొట్టడం
కొట్టటమే.
ఊర్లో వాళ్లనూ తిట్టేది...
ఒకనాడు నన్ను గదిలో పెట్టి కొడుతుంటే పొరుగువాళ్లు చూడలేకపోయారు. వాళ్లు చెప్పడంతో మా అత్తమ్మ నన్ను వెంటబెట్టుకొని వెళ్లింది. దాంతో మా అమ్మ అత్తమ్మ మీద కిడ్నాప్ కేసు పెట్టింది. మా మామ మీద కూడా కేసులు పెట్టింది. నన్ను తీసుకెళ్లిన పొరుగువాళ్ల ఇండ్ల మీదకు వెళ్లి వాళ్ల మీద దుమ్మెత్తి పోసేది. దాంతో మాకెందుకులే అని వాళ్లు నన్ను వదిలేశారు. కొన్నాళ్లు గవండ్ల వీరమ్మ తన దగ్గర ఉంచుకుంది. కానీ, అక్కడ కూడా ఉండనీయలేదు. నా దోస్తులు కావ్య, పూజిత, సమతలు కూడా నన్ను తీసుకెళ్లి అన్నం పెట్టేవాళ్లు. ఎండాకాలం వాళ్ల ఇళ్లలోనే ఉండేదాన్ని. వాళ్ల అమ్మ వాళ్లు కూడా నన్ను ఏమీ అనకపోయేవాళ్లు. కానీ మా అమ్మకు భయపడి మళ్లీ మా ఇంటికి పంపించేవాళ్లు. అందుకే ఎవరూ దగ్గర ఉంచుకోవడం లేదని చచ్చిపోవాలనుకున్నా. బావిలో పడిపోయి ప్రాణాలు వదలదలచుకున్నా.
ఆ సారు వచ్చి తీసుకొచ్చిండు
అప్పుడు చాంద్‌పాషా సారు వచ్చి నన్ను తీసుకుపోయాడు. ఒకరోజు వాళ్లింట్లనే ఉంచుకున్నాడు. తెల్లారి ఈడకు (బాలసదన్‌కు) తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ బాగనే ఉన్నా. అయితే, మా అమ్మ ఎటన్నా వెళ్లిపోతే నేను మా ఊరికి వెళ్లి అక్కడ చదువుకుంట. వారానికోసారి పనికిపోయి పైసలు తెచ్చుకుంటా. అయితే నా అన్న వాళ్లు లేరు.. మా పాలివాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర ఉంటా. కానీ మా అమ్మ దగ్గర నన్ను ఉంచొద్దు. మా అమ్మ అంటే నాకు కోపం. మా నాన్న కూడా ఓసారి నన్ను తీస్కపోతనని వచ్చిండు. కానీ అప్పుడు మా అమ్మ పంపలేదు. ఇప్పుడు మా నాన్న కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మా పెద్దమ్మ తీసుకెళతనంటోంది. కానీ, మా అమ్మకు భయపడుతోంది. అందుకే నేను ఎక్కడికీ పోను. నా దోస్తులందరూ చదువుకుంటున్నారు. నేనూ చదువుకుంటా. మూడో తరగతి వరకు చదివా. ఇప్పుడు ఐదో తరగతిలో చేరతా. ఎందుకంటే 12 ఏళ్లకు మూడో తరగతి అంటే అందరూ ఎక్కిరిస్తారు. నా దోస్తులంతా ఎనిమిది చదువుతున్నరు. నేను మాత్రం ఐదు చదువుతా. మంచిగ చదువుకుంట. మంచి ఉద్యోగం తెచ్చుకుంట.
- మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షిప్రతినిధి, నల్లగొండ
ఊర్లో వాళ్ల అనుమతితోనే తీసుకువచ్చాను
మూడు రోజుల కిందట రవళి వాళ్ల అమ్మ నా దగ్గరకు వచ్చింది. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. మీ అమ్మాయి ఎక్కడికి పోదులే నేను పంపిస్తా అని చెప్పాను. అయితే రవళిని వాళ్ల అమ్మ కొట్టేదని ఆ తర్వాత తెలిసింది. ఒకనాడు ఊర్లో ఉన్న వాళ్లే నా దగ్గరకు తీసుకొచ్చి ఈ అమ్మాయిని ప్రభుత్వానికి అప్పగించాలని అడిగారు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటేనే బావి దగ్గరికి వెళ్లి చచ్చిపోవాలని ప్రయత్నించింది. అందరం కలిసి అడ్డుకున్నాం. ఏదో సర్దిజెప్పి పంపినం. కానీ తెల్లారి గ్రామంలోని మహిళలే మళ్లీ నా దగ్గరకు రవళిని తీసుకువచ్చి ఎప్పుడు తీసుకెళ్తున్నవని అడిగారు. అక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లా. తెల్లారి గ్రామ సర్పంచ్, పెద్ద మనుషుల అనుమతి తీసుకున్నా. అక్కడి నుంచి ఎమ్మార్వో ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చా. ఆయన శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఇప్పుడు బాలసదన్‌లో ఉంది. హిందూ పండుగలయినా, ముస్లిం పండుగలయినా ఈ అమ్మాయిని నేను మా ఇంటికి తీసుకెళ్తా. అమ్మాయి బాగా చదువుకుని స్థిరపడితే నా జన్మకు అది చాలు.
- ఎస్కే. చాంద్‌పాషా, గ్రామ రెవెన్యూ అధికారి, దత్తప్పగూడెం.