మూడేళ్లలో 30 సినిమాలకు తిరస్కారం!
శతృఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా, అనిల్‌కపూర్ కుమార్తె సోనమ్‌కపూర్, మహేష్‌భట్ తనయ ఆలియా భట్ల రంగప్రవేశం తర్వాత బాలీవుడ్లో అందరి కళ్లూ నటుడు గోవిందా కూతురు నర్మద రంగప్రవేశంపైనే ఉన్నాయి. ఇదిగో... అదిగో అంటూ గత మూడేళ్లుగా నర్మద అరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ, ఇంకా నర్మద తెరపై కనిపించనేలేదు. తను చేసే సినిమాలన్నీ ఓ స్థాయిలో ఉండాలని అనుకుంటోందట నర్మద. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటోందట.
ఈ మూడేళ్లల్లో దాదాపు ముప్ఫయ్ సినిమాలు తిరస్కరించిందని నర్మద తల్లి సునీత ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. దీన్నిబట్టి నర్మద ఎంత శ్రద్ధ వహిస్తోందో ఊహించవచ్చు. తన తండ్రిలానే వినోద ప్రధానంగా సాగే సినిమాల్లో నటించాలనుకుంటోందట నర్మద. పాల మీగడలా తెల్లని తెలుపు రంగులో, మంచి శరీరాకృతితో ఉన్న నర్మద అభినయపరంగా కూడా భేష్ అనిపించుకుంటుందని హిందీ చిత్రసీమవారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి.. 30 సినిమాలు తిరస్కరించిన నర్మదకు నచ్చే కథ దొరికేదెప్పుడో? తెరపై కనిపించేదెప్పుడో కాలమే చెప్పాలి.