కుమార్తెకు రజనీ అభినందనలు
తన కుమార్తె ప్రతిభను జనులు పొగుడుతుండగా, ఆ ఆనందానుభూతిని పొందుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ కూడా దర్శకురాలు సౌందర్యను అభినందించా రు. కన్న తండ్రి సినిమాకు కుమార్తె దర్శకత్వం చేయడం అనేది అపూర్వమైన, అరుదైన విషయం. అది ఒక అద్భుత ప్రయోగంతో చిత్ర రూపకల్పన చేసి విజయం సాధించడం సాధారణ విషయం కాదు. ఈ రెండు అసాధారణ విషయాలను సుసాధ్యం చేశారు. రజనీకాంత్. ఆయన రెండవ కూతురు సౌందర్య. వీరి అద్భుత సృష్టి కోచ్చడయాన్. ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. విజయం అనేది అంత సులభంగా రాదు. దానికి నిరంతర కృషి, పట్టుదల, శ్రమ అవసరం.
కోచ్చడయాన్ చిత్రం రూపకల్పన వెనుక ఇవన్నీ ఉన్నాయి. చిత్రం విడుదల తల్లి పురుటి నొప్పులతో సమానం అంటారు. కోచ్చడయాన్ చిత్రం విడుదలకు ముందు చాలా ప్రతి ఘటనలను ఎదుర్కొంది. ఎన్నో వదంతులకు గురైంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితిలో విడుదల తేదీ వాయిదా పడితే చిత్రంపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అలాంటి అవరోధోలను దాటి కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ టాక్‌ను రాబట్టుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్లలో కోచ్చడయాన్ ప్రశంసల పరంపర కొనసాగుతోంది. చిత్ర యూనిట్లో విజయ దరహాసం తొణికిసలాడుతోంది. ఒక పక్క కోచ్చడయాన్ చిత్రానికి అభినందలు వెల్లువెత్తుతుంటే మరో రజనీకాంత్ ఈ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన తన కూతురు చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌ను, చిత్ర కళాకారులను సాంకేతిక వర్గాన్ని ప్రంశంసించారు.
వదంతులను తిప్పికొట్టింది
వదంతులను తిప్పికొట్టి అలాంటివి ప్రచారం చేసిన వారికి కోచ్చడయాన్ విజయం సరైన బుద్ధి చెప్పిందని రజనీ అభిమానులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్చడయాన్ బొమ్మల చిత్రం అంటూ ఎద్దేవా చేసిన వారికి చిత్ర విజయమే సమాధా నం చెప్పిం దన్నారు. చెన్నై రజనీకాంత్ అభిమాన సంఘం నిర్వాహకులు రామదాస్, రవి, సూర్య తదితరులు విడుదల చేసిన ఈ ప్రకటనలో పేర్కొంటూ తమ తలైవర్ (నాయకుడు) నటించిన కోచ్చడయాన్ విజయం సాధించిందన్నారు. ఈ అద్భుత విజయాన్ని అందించిన ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు రజనీ కాంత్ అభిమాన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. చిత్రం పైరసీకి గురికాకుండా రజనీ అభిమానులంతా అప్రమత్తంగా ఉండి అలాంటి సంఘటనలు జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.