ఉగ్రమూకలకు అండ ఐఎస్ఐనే..!
♦ ముంబై దాడులపై అప్రూవర్ హెడ్లీ నిర్ధారణ
♦ ఐఎస్ఐ నుంచి లష్కరే, జైషే, హిజ్బుల్‌కు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం
♦ లష్కరే చీఫ్ లఖ్వీకి ఆదేశాలిచ్చింది ఐఎస్ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్
♦ సిద్ధి వినాయక ఆలయం వద్ద కూడా రెక్కీ నిర్వహించా
♦ మొదట ‘తాజ్’లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సుపై దాడికి ప్లాన్ చేశారు
♦ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ.. రెండింటి కోసం పనిచేశా
ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55).. ఆ దాడుల్లో పాక్ ప్రమేయాన్ని నిర్ధారించే సంచలన వాస్తవాలను వెల్లడిస్తున్నాడు. భారత ఆర్థిక రాజధాని ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐనేనని,ఆ దాడులకు సంబంధించి లష్కరే తోయిబా చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి ఆదేశాలిస్తూ, పర్యవేక్షించింది స్వయంగా ఐఎస్ఐ అధికారైన బ్రిగేడియర్ రియాజ్ అని వెల్లడించాడు. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం ఐఎస్ఐ నుంచే అందుతోందన్నాడు.
ముంబై దాడులకు ముందు తాను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. ఆ రెండు చోట్ల రెక్కీకి లష్కరేలో తన బాస్ సాజిద్ మిర్ తనను ఆదేశించారని తెలిపాడు. ‘సిద్ధి వినాయక వీడియో తీయాలని ప్రత్యేకంగా చెప్పాడు’ అని వివరించాడు. తాను లష్కరేతో పాటు పాక్ ఆర్మీ , ఐఎస్ఐ కోసమూ పని చేశానన్నాడు. భారత సైన్యంలోని కీలక సమాచారాన్ని సంపాదించాలని, భారత సైనికులను తమ గూఢచారులుగా నియమించేందుకు ప్రయత్నించాలని ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ తనను ఆదేశించారని వెల్లడించాడు. వరుసగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా 4 గంటల పాటు హెడ్లీ వాంగ్మూలం ఇచ్చారు. లష్కరే లఖ్వీ ఫొటో చూపగా, అది లఖ్వీదేనన్నాడు. ముంబై దాడుల కేసులో అమెరికాలో హెడ్లీ 35 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. దాడులతో ఐఎస్ఐకి , తమ సైన్యానికి కానీ, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఇన్నాళ్లూ చేసిన బుకాయింపుల నిజరూపం హెడ్లీ చెబుతున్న వివరాలతో తేటతెల్లం కానుంది. నేడూ వాంగ్మూలం కొనసాగనుంది. కాగా, ముంబై దాడుల దోషులను చట్టం ముందు నిలిపేందుకు పూర్తి సహకారం భారత్‌కు అందిస్తామని అమెరికా పేర్కొంది.
హెడ్లీ చెప్పిన మరికొన్ని వివరాలు..
► 2007 నవంబర్, డిసెంబర్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో లష్కరే భేటీ ఏర్పాటు చేసింది. లష్కరే కీలక సభ్యులు సాజిద్ మిర్, అబూ కాఫా కూడా హాజరయ్యారు. ముంబైలో దాడులు చేయాలని నిర్ణయించారు. తాజ్ హోటల్ వద్ద రెక్కీ బాధ్యతను నాకు అప్పగించారు. త్వరలో తాజ్‌లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సు జరగనుందని, సదస్సు లక్ష్యంగా దాడులు చేద్దామని సాజిద్ మిర్, కాఫా ప్రతిపాదించారు. హోటల్ భవన నమూనానూ రూపొందించారు. అయితే, దాడికి కావాల్సిన ఆయుధాలతో పాటు, దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ముంబైలోకి చేరవేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రణాళికను విరమించుకున్నారు. సదస్సు ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కచ్చితమైన సమాచారం లేకపోవడమూ మరో కారణం.
► ఐఎస్ఐ, లష్కరే సమన్వయంతో పనిచేస్తుంటాయి. నేను విన్న విషయాల ఆధారంగానే ఈ అభిప్రాయానికి వచ్చాను.
► ముంబై దాడుల బాధ్యత మొత్తం లష్కరే గ్రూప్ అంతటిది. అయితే, ఆ సంస్థ చీఫ్ లఖ్వీ కనుక దాడులకు సంబంధించిన ఆదేశాలు ఆయన నుంచి వచ్చి ఉండవచ్చు.
► ముంబైకి మొదటిసారి 2006, సెప్టెంబర్ 14న వచ్చాను. పలు ప్రాంతాలను సర్వే చేశాను. 2007లో పలుమార్లు హోటల్ తాజ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహించాను. 2008లో మహారాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, నేవల్ ఎయిర్ స్టేషన్లపై రెక్కీ నిర్వహించాను. ఉగ్రవాదులు ఎక్కడెక్కడెక్క దిగాలో నేనే నిర్ణయించాను.
► పాక్ ఆక్రమిత కశ్మీర్ పనిచేస్తున్న యునెటైడ్ జీహాద్ కౌన్సిల్లో లష్కరే, జైషే, హిజ్బుల్, హర్కత్ తదితర ఉగ్రసంస్థలు భాగస్వాములు.
► పాక్ సైన్యంలోని అధికారులు కల్నల్ హమ్జా, కల్నల్ షా, సామిర్ అలీ నాకు బాగా తెలుసు.
► పాక్ మాజీ సైన్యాధికారి రెహ్మాన్ పాషాను 2003లో కలిశాను. అప్పుడు ఆయన లష్కరే కోసం పనిచేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత అల్‌కాయిదాలో చేరారు. ఒక లష్కరే భేటీకి ప్రధాన వక్తగా వచ్చినప్పుడు జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను చూశాను.
► లష్కరేను నిషేధించిన అమెరికా నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంపై లఖ్వీ సాబ్తో, హఫీజ్ సయీద్ సాబ్తో చర్చించాను. కానీ ఐఎస్ఐ సహా పలు పాక్ ప్రభుత్వ సంస్థలు అందులో భాగం కావాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించాం.
► డబ్బు కోసం మోసం చేశానని లాహోర్ పోలీస్ స్టేషన్లో నా భార్య ఫైజా 2007 డిసెంబర్లో నాపై కేసు వేసింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నానని, లష్కరేతో సన్నిహిత సంబంధాలున్నాయని 2008లో ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో ఫిర్యాదు చేసింది.