ఔను అది దారుణమే.. మమ్మల్ని క్షమించండి!
షికాగో: ప్రయాణికుడిని దారుణంగా విమానం నుంచి ఈడ్చిపారేసిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యునైటెడ్ ఎయిర్లైన్స్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. జరిగిన ఘటన బాధాకరమే అంటూ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఆదివారం షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
అధికంగా టికెట్లు బుక్ అయిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో సీట్లు ఖాళీగా లేవనే కారణంతో 69 ఏళ్ల డేవిడ్ డావో అనే ప్రయాణికుడిపై విమాన సిబ్బంది దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. ’నన్ను చంపండి.. అంతేకానీ నేను ఇంటికి వెళ్లాలి’ అని ఆసియాకు చెందిన డాక్టర్ అయిన ఆయన ఎంత వేడుకున్నా.. కనికరించని సిబ్బంది ఆయనను అత్యంత కిరాతకంగా విమానం నుంచి ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో ఆయన నోటినుంచి రక్తం ధారాళంగా కారినా పట్టించుకోలేదు. ఈ అమానుషాన్ని తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఈ వీడియోలను చూసి దిగ్భ్రాంతిచెందిన నెటిజన్లు ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఈసీవో ఆస్కార్ మునోజ్ స్పందించారు. ‘మా విమానంలో జరిగిన ఘటన నన్ను కలత పెడుతున్నది. బలవంతంగా విమానం నుంచి ఈడ్చేసిన ప్రయాణికుడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రయాణికులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.
— Enrico Valenzuela (@enricovalen) 11 April 2017